ఏపీ ప్రభుత్వం పాలనలో పరుగులు పెడుతోంది. జగన్ ముఖ్యమంత్రి అయి నెల కూడా కాలేదు కానీ.. ఏపీలో ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. ఏపీ స్వరూపాన్నే మార్చేశారు. ఇప్పటికే కొన్ని పథకాలను ప్రారంభించడం.. వాటి అమలు కూడా కొనసాగుతోంది. విద్యార్థులకు కార్పొరేట్, నాణ్యమైన విద్య అందించడం కోసం రూపొందించిన అమ్మ ఒడి పథకంపై జగన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. సీఎం క్యాంప్ ఆఫీసులో విద్యాశాఖపై నిర్వహించిన సమీక్షలో జగన్ అమ్మ ఒడి పథకంపై చర్చించారు.
ఇప్పటి వరకు అమ్మ ఒడి పథకం పదో తరగతి వరకు మాత్రమే అర్హత ఉండేది. కానీ.. దాన్ని ఇంటర్మీడియట్ విద్యార్థులకు కూడా వర్తింపజేయాలని సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. హాస్టళ్లు, రెసిడెన్షియల్ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు కూడా అమ్మ ఒడి పథకం వర్తింపజేయాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. తెల్లరేషన్ కార్డు ఉన్న ప్రతి తల్లికి ప్రతి సంవత్సరం 15 వేల రూపాయలు అందించాలని సీఎం విద్యాశాఖకు వెల్లడించారు.