జనంలోకి జగన్ దూసుకుపోతున్నారు. మంత్రులు కూడా అదేవిధంగా చొచ్చుకుపోయేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారు. వచ్చే ఎన్నికలే లక్షంగా జగన్ చేస్తున్న ప్రయత్నాలు కొన్ని సత్ఫలితాలు ఇవ్వనున్నాయి. ఆ దిశగా జగన్ కొన్ని ప్రాధాన్యాంశాలను దృష్టి లో ఉంచుకుని పాలన చేస్తున్నారు. చేయాలని పరితపిస్తున్నారు కూడా ! ఇదే సమయంలో పాలనలో ఉన్న వైఫల్యాలను దిద్దుకోవాల్సిన బాధ్యత కూడా ఆయనపైనే ఉందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ముఖ్యంగా మంత్రులు వాస్తవిక స్థితిగతులను అర్థం చేసుకుని ఆ విధంగా జనంలో మెలగాలని కోరుతున్నారు.
లక్షా ఇరవై వేల కోట్ల మేరకు సంక్షేమానికే నిధులు ఇచ్చిన దాఖలాలు ఉన్న నేపథ్యంలో రానున్న కాలంలో సంక్షేమానికి మరింత ప్రాధాన్యం ఇచ్చేందుకు జగన్ యోచిస్తున్నారు. ఇప్పటిదాకా ఉన్న సంక్షేమ పథకాలను క్యాలెండర్ ను అనుసరించి అమలు చేయడమే కాకుండా, నిర్వహణ లోపాలను అధిగమించే ప్రయత్నం ఒకటి చేస్తున్నారాయన. నిర్వహణ లోపాలు దిద్దుబాటుకు నోచుకుంటే జనంకు ప్రభుత్వంపై నమ్మకం పెరుగుతుంది. ఆ నమ్మకం రేపటి వేళ ఓటు బ్యాంకును ప్రభావితం చేసే విధంగా ఉంటుంది. అందుకే క్షేత్ర స్థాయిలో వాస్తవాల అంచనాలకు గడపగడపకూ మన ప్రభుత్వం కార్యక్రమాన్ని జగన్
నిర్వహింపజేస్తున్నారు. మరో రెండు నెలల పాటు ఇదేవిధంగా ఎమ్మెల్యేలు తిరగాల్సి ఉంటుంది. మంత్రి వర్గంలో కొందరు చెబుతున్న విధంగా ఎన్నికల వరకూ ఇదే ప్రక్రియ కొనసాగించాలని యోచిస్తున్నారు. అన్నీ కుదిరితే మరో ఇరవై రోజుల్లో శ్రీకాకుళం మొదలుకుని జిల్లాల పర్యటనకు జగన్ ప్రాధాన్యం ఇవ్వనున్నారు.