భూకుంభకోణం.. మనీ ల్యాండరింగ్ .. ఇలా ఒక్కటేమిటి, చాలా కేసుల్లో చిక్కుకున్నారు జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్. ఈడీ బృందాలు ఇప్పుడు ఆయన కోసం దేశమంతా గాలిస్తున్నాయి. ఆయన్ని విచారియించడం కోసం ఈడీ బృందం ఢిల్లీలోని ఆయన నివాసానికి వచ్చారు. రోజంతా ఎదురుచూసినా సొరేన్ జాడ కనిపించకపోవడంతో ఈడీ అధికారులు వెనుదిరిగారు. సొరేన్ కి సంబంధించిన కారు, 36 లక్షల రూపాయలను స్వాధీనం చేసుకుని వెళ్లిపోయారు. అయితే కనిపించకుండా పోయిన సొరేన్ 18 గంటల తరువాత రాంచీలో ప్రత్యక్షమయ్యాడు. తన పార్టీ ఎమ్మెల్యేలతో భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఆయన జనవరి 31న ఈడీ విచారణకు హాజరవుతారని పార్టీ వర్గాలు అంటున్నారు.
భూకుంభకోణంలో హేమంత్‌సోరెన్‌ను ఈడీ అరెస్ట్ చేస్తుందని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈడీ సమన్లపై న్యాయపోరాటం చేయాలని హేమంత్ సోరెన్ నిర్ణయించినట్టు తెలుస్తోంది.సుప్రీంకోర్టు ప్రముఖ న్యాయవాదులు అభిషేక్ సింఘ్వీ, కపిల్‌సిబాల్‌తో ఆయన సంప్రదింపులు జరిపారు.కాగా, ఈ ఘటన అంతా హేమంత్ సోరెన్ పరువు తీసేందుకు జరిగిన కుట్ర అని సీఎం సోరెన్ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.ఈడీ దాడులకు భయపడి 18 గంటలుగా పరారీలో ఉన్నారని జార్ఖండ్ బీజేపీ నేతలు ఆరోపించారు. ఈ సందర్భంగా, జార్ఖండ్ రాష్ట్ర ప్రతిష్ట ప్రమాదంలో ఉందని, ఈ విషయాన్ని గుర్తించాలని బీజేపీ నేతలు గవర్నర్ సీపీ రాధాకృష్ణన్‌ను కోరారు.
భూకుంభకోణం కేసులో సోరెన్‌ను జనవరి 20న రాంచీలోని అతని అధికారిక నివాసంలో ED ప్రశ్నించింది. జనవరి 29 లేదా జనవరి 31న విచారణకు హాజరవుతాడా లేదా అని చెప్పాలని కోరుతూ అతనికి తాజాగా సమన్లు జారీ చేసింది. సీఎం సోరెన్ ఈడీకి లేఖ పంపారు. కానీ విచారణకు రోజు లేదా తేదీని పేర్కొనలేదు. జనవరి 28న EDకి పంపిన ఈ-మెయిల్‌లో, రాష్ట్ర ప్రభుత్వ పనితీరును అడ్డుకోవడానికి రాజకీయ ఎజెండాతో ఇది ప్రేరేపించబడిందని సోరెన్ ఆరోపించాడు. జనవరి 31 లేదా అంతకంటే ముందు తన స్టేట్‌మెంట్‌ను తిరిగి రికార్డ్ చేస్తామని పేర్కొన్నాడు. ED మొండితనం దాని చెడు సంకల్పాన్ని చూపుతుందని మండిపడ్డారు.