ఏపీలో బీజేపీ బలోపేతానికి కాకుండా.. టీడీపీ అభివృద్ధికి సహకరిస్తున్నారో లేక పార్టీ విధానాలకు వ్యతిరేకంగా గవర్నర్ కు లేఖ రాశారనో తెలియదు కానీ… కన్నాను పార్టీ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సోము వీర్రాజుకు పార్టీ పగ్గాలు అప్పగించింది. నాటి నుంచి ఏపీలో రాజకీయంగా కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్న సంగతి తెలిసిందే. దీంతో కన్నాంకు ఏమాత్రం పడని ఒక సీనియర్ నేత నేడు బీజేపీలో చేరడానికి లైన్ క్లియర్ అయ్యిందని అంటున్నారు. అదే జరిగితే… కన్నా తీవ్ర మనస్థాపానికి గురయ్యఏ అవకాశం ఉందనేది రాజకీయ వర్గాల్లో నడుస్తోన్న చర్చ!
అవును… రాయపాటి సాంబశివరావు బీజేపీలో చేరనున్నట్లు ఎనిమిది నెలల క్రితమే ప్రకటించినప్పటికీ… ఆయన మెడలో ఇప్పటివరకూ కాషాయ కండువా పడలేదు. దానికి కారణం కన్నా లక్ష్మీనారాయణ అనేది పొలిటికల్ సర్కిల్ లో ఓపెన్ సీక్రెట్. దానికి కారణం… గుంటూరు రాజకీయాల్లో రాయపాటి సాంబశివరావు – కన్నా లక్ష్మీనారాయణ ల మధ్య తీవ్ర స్థాయిలో విభేదాలుండటమే! ఇవి రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పటినుంచి సాగుతున్న వ్యవహారాలు!
2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పరాజయం పాలవ్వడంతో రాయపాటి సాంబశివరావు బీజేపీలో చేరేందుకు ప్రయత్నించిన సంగతి తెలిసిందే. దానికి కారణం… ఆయనపై ఉన్న సీబీఐ కేసులు, బ్యాంకు లావాదేవీ అనేది గట్టిగా వినిపించే మాట! ఈ క్రమలో కన్నా అధ్యక్షుడిగా ఉన్నంతకాలం… రాయపాటికి ఆ ఛాన్స్ లేకుండా పోయింది! అయితే… తాజాగా కన్నా ప్లేస్ లో సోము వీర్రాజు రావడంతో… రాయపాటికి లైన్ క్లియర్ అయ్యిందనే కామెంట్లు వినిపిస్తున్నాయి!
ఇదే జరిగి.. ఏ కన్నా అయితే ఆయన రాకను అడ్డుకున్నారో.. అదే కన్నా సమక్ష్యంలో.. సోము ఆధ్వర్యంలో రాయపాటి రాయల్ గా బీజేపీలోకి చేరబోతున్నారని అంటున్నారు. అదే జరిగితే కన్నా లక్ష్మీనారాయణ తీవ్ర మనస్థాపానికి గురయ్యే అవకాశాలున్నాయని.. ఫలితంగా కన్నా పూర్తిస్థాయి టీడీపీ నేతగా మారే అవకాశాలుండే అవకాశం ఉండొచ్చని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు!