నా జీవితంలో చూడలేదు…! ఇక నుంచి మేమేంటో చూపిస్తాం…!

-

మున్సిపల్ ఎన్నికల్లో ఘన విజయం అనంతరం తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్ తెలంగాణా భవన్ లో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేసారు. తన జీవితంలో ఇలాంటి విజయాన్ని ఎప్పుడూ చూడలేదని కెసిఆర్ హర్షం వ్యక్తం చేసారు. ఎన్నికల్లో తెరాస కు ప్రజలు అద్భుత విజయాన్ని అందించారని ఆయన కొనియాడారు. అసెంబ్లీ, పార్లమెంట్, స్థానిక సంస్థల ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికలు.. ఇలా అన్ని ఎన్నికల్లోనూ తమకే పట్టం గట్టారని ఆయన అన్నారు.

మున్సిపల్ ఎన్నికలు జరగకుండా విపక్షాలు ఎన్నో కుట్రలు చేశాయని, అలాంటి వారికి ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పారని అన్నారు. లక్ష్యం కోసం పనిచేయాలంట మళ్లీ తమను ఆశీర్వదించారన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పని చేస్తామని ఆయన స్పష్టం చేసారు. ఇక ఈ సందర్భంగా మంత్రి కేటిఆర్ ని ఉద్దేశించి మాట్లాడిన కెసిఆర్… కేటీఆర్‌కు తన ఆశీస్సులు తెలుపుతున్నట్లు చెప్పుకొచ్చారు. ఈ ఎన్నికల కోసం తాము పెద్దగా ప్రచారం చేయలేదని అన్నారు.

కేటీఆర్ దావోస్‌కు వెళ్లారని, ఈ ఎన్నికల్లో తాను ఎక్కడికీ వెళ్లలేదన్నారు. ఎక్కడా అధికార దుర్వినియోగానికి పాల్పడలేదన్న కెసిఆర్, వేల కోట్లు ఖర్చుచేశామని ఎలా అంటారని ప్రశ్నించారు. మేం రూ.80 లక్షల మేర పార్టీ మెటీరియల్ మాత్రమే పంపించామన్న ఆయన, అంతకు మించి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని స్పష్టం చేసారు. విపక్ష నేతలకు విలువలు లేవన్నారు కెసిఆర్. సీఎంను, మంత్రులను ఇష్టమొచినట్లు తిట్టారని మండిపడ్డారు. ఇప్పటిదాకా విపక్షాల వ్యక్తిగత దూషణలను సహించామని, ఇకపై ఊరుకోబోమని హెచ్చరించారు.

అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. స్థాయిని మించి, హోదాను మించి అధిక ప్రసంగాలు చేస్తే ప్రజలు అసహ్యించుకుంటున్నారన్న ఆయన, ప్రజలు ఇచ్చిన తీర్పును అందరూ గౌరవించాలని హితవు పలికారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఒకే రకమైన తీర్పు ఇచ్చారన్నారు. తెరాస అమలు చేస్తున్న పథకాల వల్లే ఇలాంటి ఫలితాలు వస్తున్నాయని కెసిఆర్ పేర్కొన్నారు. విజయం కోసం పోరాడిన నాయకులు, కార్యకర్తలందరికీ కృతజ్ఞతలు అంటూ అభినందించారు. పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌కు నా అభినందనలన్నారు.

స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇలాంటి ఘన విజయం సాధించడం చాలా అరుదని చెప్పిన ఆయన… గతేడాది 32 జిల్లా పరిషత్‌లను కైవసం చేసుకున్నామన్నారు. అన్ని రకాల ప్రజలు ఉండే పట్టణాల్లో ఇలాంటి ఫలితాలు రావడం చాలా అరుదని ఆయన అభిప్రాయపడ్డారు. చెంప ఛెల్లుమని అనిపించినట్లుగా జాతీయ పార్టీలకు ఫలితాలు ఉన్నాయని దుయ్యబట్టారు. సోషల్‌ మీడియా దూషణలు సరికాదన్నారు. అది యాంటీ సోషల్‌మీడియా అన్నారు. ఇకపై సోషల్‌మీడియాలో దుష్ప్రచారాలు, వ్యక్తిగత దూషణలపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

ఇక పౌరసత్వ సవరణ చట్టం గురించి మాట్లాడుతూ, సిఏఏపై కేంద్రం వైఖరి తప్పన్న ఆయన ఆర్టికల్ 370 సరైనది కాబట్టి మద్దతు ఇచ్చామని, పౌరసత్వ సవరణ చట్టం తప్పు కాబట్టి పార్లమెంట్ లో వ్యతిరేకించామని అన్నారు. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేస్తామని అన్నారు. దీనిపై నరేంద్ర మోడీ, అమిత్ షా పునరాలోచించాలని కెసిఆర్ హితవు పలికారు. ఇది రాజ్యాంగ విరుద్దమని కెసిఆర్ అన్నారు. ఉద్యోగుల డిమాండ్లపై పరిశీలిస్తామని హామీ ఇచ్చారు. 57 ఏళ్ళు దాటిన వారికి రూ.2016 పించన్ ఇస్తామని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news