వైసీపీలో క్షేత్ర‌స్థాయి ప్ర‌క్షాళ‌న‌.. సీనియ‌ర్‌ల‌కు కీల‌క ప‌ద‌వులు

-

ఏపీలో ఎన్నిక‌లు ముగిసి మూడు నెల‌లు పూర్త‌యింది.తెలుగుదేశం పార్టీ,జ‌న‌సేన‌,భార‌తీయ జ‌న‌తాపార్టీలు కూట‌మిగా ఏపీలో ప్ర‌భుత్వాన్ని న‌డుపుతున్నాయి.ఈ ఎన్నిక‌ల్లో ఓట‌మి చెందిన వైసీపీ… ప‌రాజ‌యం పాల‌వ‌డానికి గ‌ల కార‌ణాల‌పై స‌మీక్షించుకుంటోంది. 2019లో 151 సీట్ల‌తో తిరుగులేని మెజారిటీ సాధించి ప్ర‌భుత్వాన్ని న‌డిపిన వైసీపీ 2024 ఎన్నిక‌ల్లో ఘోర ఓట‌మిని మూట‌గ‌ట్టుకుంది. ఈ క్ర‌మంలో ఓట‌మికి గ‌ల కార‌ణాల‌పై స‌మీక్ష చేప‌ట్టిన పార్టీ అధినేత జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ముందుగా అధ్య‌క్షుల మార్పుల‌పై దృష్టిపెట్టారు.

వైసీపీ నేతల వలసల నేపథ్యంలో అధినేత జగన్ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా పార్టీని క్షేత్రస్దాయి నుంచి ప్రక్షాళన చేసుకుంటూ వస్తున్న వైఎస్ జగన్ మరికొన్ని నిర్ణయాలు ప్రకటించారు. జిల్లా అధ్యక్షుల మార్పులు సహా పలు నియామకాలకు శ్రీ‌కారం చుట్టారు.అసెంబ్లీ ఎన్నిక‌లు రావ‌డానికి ఐదేళ్ళ స‌మ‌యం ఉంది.దీంతో స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో స‌త్తా చాట‌డ‌మే ల‌క్ష్యంగా పెట్టుకున్నారు వైసీపీ అధినేత జ‌గ‌న్‌.

వైసీపీలోని ప‌లువురు నేత‌ల‌కు కీల‌క ప‌ద‌వుల‌ను ప్ర‌క‌టించారు జ‌గ‌న్‌. మాజీ అదనపు అడ్వకేట్‌ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డికి కూడా ఈ లిస్టులో చోటు ద‌క్క‌డ‌మే కాదు ప్ర‌మోష‌న్ ల‌భించింది.పొన్న‌వోలును పార్టీ రాష్ర్ట ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా నియ‌మిస్తూ జ‌గ‌న్ ఉత్త‌ర్వులిచ్చారు. ఇక వైసీపీ అధినేత జగన్ కు సలహాదారుగా ఆళ్ల మోహన్ సాయిదత్ ను నియమించారు. అలాగే పెనమలూరుకు చెందిన వేణుగోపాల్ కృష్ణమూర్తిని రాష్ట్ర కార్యదర్శిగా నియమించారు. అలాగే వైసీపీలో 41 అనుబంధ విభాగాలకు అధ్యక్షుల్ని ఖ‌రారు చేస్తూ జగన్ ఓ ప్రకటన విడుదల చేశారు.

మరోవైపు కర్నూలు జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా ఎస్వీ మోహన్ రెడ్డిని నియమించారు. అలాగే నంద్యాల జిల్లా పార్టీ అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డిని నియమిస్తూ జగన్ మరో ప్రకటన విడుదల చేశారు. ఇంకా మ‌రికొన్ని జిల్లాల అధ్య‌క్షుల నియామ‌కంపై జ‌గ‌న్ క‌స‌ర‌త్తు చేస్తున్నారు.కూట‌మి ప్ర‌భుత్వం చేసే త‌ప్పుల‌పై ధైర్యంగా పోరాడ‌గ‌లిగే నేత‌ల‌ను ఎంచుకుని మ‌రీ ప‌ద‌వుల‌ను కేటాయిస్తున్నారు.కార్య‌క‌ర్త‌ల‌కు ఎప్పుడూ అందుబాటులో ఉండాల‌ని,పోరాటాల స‌మ‌యంలో వారికి అన్నివిధాలా స‌హ‌క‌రించాల‌ని నేత‌ల‌కు జ‌గ‌న్ సూచ‌న‌లు చేస్తున్నారు.

గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీ ఓటమి పాలయ్యాక జరుగుతున్న ఈ నియామకాలతో పార్టీలో జవసత్వాలు నింపేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారు. ముఖ్యంగా వచ్చే ఐదేళ్ల పాటు పార్టీని నిలబెడతారని భావిస్తూ ఆర్ధికంగా బలవంతులైన వారిని ఎంపిక చేస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే కూటమి ప్రభుత్వంతో సై అంటే సై అనే నేతలను జగన్ ఎంపిక చేస్తున్నారు. తద్వారా ఐదేళ్ల పాటు క్యాడర్ లోనూ పాజిటివ్ ఫీల్ నిలబెట్టాలని భావిస్తున్నారు.విశాఖ స్థానిక సంస్థ‌ల ఎమ్మెల్సీ స్థానాన్ని ద‌క్కించుకోవ‌డంలో జ‌గ‌న్ వేసిన అడుగులు ఫ‌లించాయి.ఇదే విధంగా ఏపీ వ్యాప్తంగా త్వ‌ర‌లో జ‌రుగనున్న స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో స‌త్తా చాటాల‌ని జ‌గ‌న్ నిర్ణ‌యించుకున్నారు.త‌ద‌నుగుణంగా రాష్ర్ట‌,జిల్లా స్థాయి క‌మిటీల‌ను ఏర్పాటు చేస్తున్నారు.వైసీపీ నుంచి వ‌ల‌స వెళ్తున్న నేత‌ల‌ను ఆపే బాధ్య‌త‌ను కూడా జిల్లా అధ్య‌క్షుల‌కు అప్ప‌గిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version