రాజకీయంలో దిగ జారి మాట్లాడడం ఇప్పుడు తరుచూ చోటు చేసుకుంటున్న పరిణామాల్లో ఓ భాగం. మహానాడు అంటే టీడీపీ పండుగ. కానీ ఆ మహానాడును ఉద్దేశించి స్మార్థ కర్మలతో పోల్చి ఎలా మాట్లాడతారని టీడీపీ మండిపడుతోంది. కొడాలి నాని తాను నడిచివచ్చిన దారులు, ఎదిగివచ్చిన క్రమం మరిచిపోయి మాట్లాడుతున్న వైనం ఇప్పుడొక వివాదంగా మారుతోంది. తాను మళ్లీ గెలుస్తాను అన్న మాట బాగానే ఉంది కానీ, ఆ విధంగా ఆయన పనిచేసి నిరూపించుకోవాలి కానీ ఓ రాజకీయ పార్టీని ఉద్దేశించి మరీ అంత దిగజారిన భాషలో మాట్లాడాల్సిన అవసరమే లేదని పసుపు పార్టీ పెద్దలు నానీకి హితవు చెబుతున్నారు.
ఎవ్వరైనా చిన్న కర్మ చేశాకే పెద్ద కర్మ చేస్తారని కానీ బాబు అందుకు విరుద్ధంగా మహానాడు చేశాక మినీ మహానాడులు చేస్తున్నారు అని మాజీ మంత్రి అయిన కొడాలి నాని అనే పెద్ద మనిషి అంటున్నారు అని టీడీపీ మండిపడుతోంది. తమ పార్టీ అధినేత ఆదేశాలకు అనుగుణంగా తాము జనంలోకి వెళ్లేందుకు చేస్తున్న ప్రయత్నాల్లో ఇది ఒకటి అని, దీనిని నాని ఆలోచనలకు అనుగుణంగా ఎలా చేయగలం అని? సోషల్ మీడియాలో ప్రశ్నిస్తోంది టీడీపీ. అధికారం ఉన్నా,లేకపోయినా తాము ప్రజల్లోనే ఉంటామని అంటోంది టీడీపీ.
ఈ మాటలు వైసీపీకి వినిపించాయో లేదో కానీ వివాదం మాత్రం బాగానే రేగుతోంది. వచ్చే ఎన్నికల్లో జగన్ దగ్గర రెండు క్యాబినెట్లలో మంత్రులను ఓడించే పని ఒకటి తప్పక చేయాలని భావిస్తోంది టీడీపీ. అందుకే నానిని టార్గెట్ గా చేసుకుని రాజకీయం చేస్తోంది. కృష్ణా జిల్లా వాకిట టీడీపీ ప్రధాన శత్రువుగా నానితో పాటు పేర్నినానిని, జోగి రమేశ్ , వెల్లంపల్లితో సహా ఇతర వర్గాలనూ భావిస్తోంది. వీళ్లు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజవర్గాలలో బలమైన అభ్యర్థులను రంగంలోకి దింపి ఓడించాలని యోచిస్తోంది. ఇందులో భాగంగానే ఇప్పటి నుంచే టీడీపీ మాటల యుద్ధం తీవ్రం చేసింది.
టీడీపీకి తోడుగా జనసేన కూడా నాని మాటలను తప్పుపడుతోంది. ఎప్పటికప్పుడు నాని చర్యలను ఖండిస్తోంది. చంద్రబాబును ఉద్దేశించి మరింత చౌక బారు భాష మాట్లాడుతూ తరుచూవార్తల్లో నిలుస్తున్న నాని మినీ మహానాడులు ఉద్దేశించి చేసిన లేదా చెప్పిన మాటలు అస్సలు బాలేవన్న వాదన ఒకటి టీడీపీ తరఫున వినిపిస్తోంది. ఇక్కడి నుంచి వెళ్లి ఎదిగిన నాయకులు ఈ విధంగా మాట్లాడడం తగదని అంటోంది. గుడివాడ ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా పనిచేస్తామని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర చెబుతున్నారు.