లగడపాటి రాజగోపాల్ (Lagadapati rajagopal) … రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు పరిచయం అక్కరలేని పేరు. ఈయన రాజకీయ నాయకుడు కంటే, ఎన్నికల ముందు సర్వేలు చేసి ఏ పార్టీ గెలుస్తుందో అని చెప్పే ఆంధ్రా ఆక్టోపస్‌గా బాగా పేరు తెచ్చుకున్నారు. అయితే సర్వేలు వరుసగా ఫెయిల్ అవ్వడంతో లగడపాటి పూర్తిగా పోలిటికల్ స్క్రీన్‌పై కనిపించడం మానేశారు. తన బిజినెస్‌లని చూసుకుంటూ ప్రశాంతంగా కాలం గడుపుతున్నట్లు తెలుస్తోంది.
అయితే ఎప్పటికైనా లగడపాటి మళ్ళీ సర్వేలతో ముందుకొస్తారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అసలు రాజకీయాలు అంటే లగడపాటికి ఎలాంటి ఆసక్తి ఉందో అందరికీ తెలిసిందే. వ్యాపారవేత్తగా ఉన్న లగడపాటి కాంగ్రెస్ ద్వారా రాజకీయాల్లోకి వచ్చారు. 2004, 2009 ఎన్నికల్లో విజయవాడ ఎంపీగా గెలిచారు. ఎంపీగా ఉంటూనే సర్వేల ద్వారా బాగా ఫేమస్ అయ్యారు. ఎన్నికల ముందు ఏ పార్టీ గెలుస్తుందనే విషయాన్ని తన సర్వేల ఆధారంగా చెప్పేసేవారు.
ఇక ఇలా లగడపాటి రాజకీయం సాఫీగా సాగుతున్న సమయంలో రాష్ట్ర విభజన అంశం తెరపైకి వచ్చింది. అప్పుడు లగడపాటి ఎలాంటి రచ్చ చేశారో అందరికీ తెలుసు. అలాగే లోక్‌సభలో ఈయన పెప్పర్ స్ప్రే వ్యవహారం కూడా తెలుసు. కానీ లగడపాటి ఎన్ని చేసిన రాష్ట్రం విడిపోయింది. దీంతో లగడపాటి రాజకీయ సన్యాసం తీసుకున్నారు. కానీ సర్వేలు మాత్రం ఆపలేదు. 2014లో ఈయన సర్వే బాగానే వర్కౌట్ అయింది. కానీ 2018 తెలంగాణ, 2019 ఏపీ ఎన్నికల్లో లగడపాటి సర్వేలు ఘోరంగా ఫెయిల్ అయ్యాయి. ఈయన నమ్ముకున్న బెట్టింగ్ రాయుళ్ళు కూడా దారుణంగా నష్టపోయారు. ఇలా సర్వేలు కూడా ఫెయిల్ అవ్వడంతో, మళ్ళీ సర్వేల జోలికి వెళ్లనని చెప్పేశారు.
కానీ రాజకీయాల అంటే బాగా ఆసక్తిగా ఉండే లగడపాటి సర్వేలు వదలడం కష్టమని తెలుస్తోంది. గత మున్సిపల్ ఎన్నికల సమయంలో ఓటు వేయడానికి వచ్చి ఏపీ రాజకీయాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. అంటే లగడపాటి ఇంకా ఏపీ రాజకీయాలని గమనిస్తూనే ఉన్నారు. దీని బట్టి చూస్తే నెక్స్ట్ ఎన్నికల ముందు లగడపాటి మళ్ళీ సర్వేలతో ముందుకొస్తారని అంటున్నారు.