తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు క్షణక్షణం మారిపోతున్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియట్లేదు. ఎవరు ఎప్పుడు పార్టీ మారుతారో అర్థం కావడం లేదు. నిన్నటి వరకు టీఆర్ఎస్ పార్టీలో సబితా ఇంద్రారెడ్డి, ఆమె కొడుకు కార్తీక్ రెడ్డి టీఆర్ఎస్ లో చేరుతున్నారని వార్తలు వచ్చాయి. తర్వాత సబిత.. టీఆర్ఎస్ లో చేరడం లేదని కూడా వార్తలు వచ్చాయి. సబితా ఇంద్రారెడ్డి పార్టీ మారనున్నారని తెలుసుకున్న కాంగ్రెస్ నేతలు ఆమెను బుజ్జగించేందుకు ప్రయత్నించారు. రేవంత్ రెడ్డిని రాయబారానికి పంపారు. రేవంత్ రెడ్డి.. సబితను కలిసి మాట్లాడారు. ఫోన్ లో రాహుల్ గాంధీతో కూడా మాట్లాడించారు. దీంతో ఆమె టీఆర్ఎస్ పార్టీలో చేరడానికి వెనుకడుగు వేసినట్టు ఊహాగానాలు వినిపించాయి.
కానీ.. రేవంత్ రాయబారం, కాంగ్రెస్ బుజ్జగింపులు సబిత ముందు ఏమాత్రం పనిచేయలేదు. తన కొడుకు కార్తీక్ కు అసెంబ్లీ ఎన్నికల సమయంలో రాజేంద్రనగర్ టికెట్ ను కేటాయించకపోవడం, ఇప్పుడు చేవెళ్ల ఎంపీ టికెట్ దక్కకపోవడం ఆమెను తీవ్రంగా బాధించాయి. తాజాగా… టీఆర్ఎస్ పార్టీలో సబితకు, ఆమె కొడుకు సముచిత స్థానం ఇవ్వడం కోసం హామీ రావడంతో ఆమె టీఆర్ఎస్ లో చేరడం ఖాయమైంది. సాయంత్రం వరకు కాంగ్రెస్ లోనే కొనసాగాలనుకున్న సబిత.. ఒక్కసారిగా యూటర్న్ తీసుకొని టీఆర్ఎస్ లో చేరాలని నిర్ణయించుకున్నారు. ఆమె బుధవారం తన కొడుకు కార్తీక్ రెడ్డి, తన అనుచరులతో కలిసి టీఆర్ఎస్ పార్టీలో చేరనున్నట్టు సమాచారం.