మంగళగిరిలో నారా లోకేశ్‌కు ఎదురుదెబ్బ‌.. ఇక గెల‌వ‌న‌ట్టేనా?

టీడీపీ నేత‌లంద‌రూ వైసీపీలో చేరుతుండ‌టంతో మంగ‌ళ‌గిరిలో నారా లోకేశ్ గెలిచే అవ‌కాశాలు త‌గ్గుతున్న‌ట్టేన‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు భావిస్తున్నారు.

ఏపీ మంత్రి నారా లోకేశ్.. గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే. ఆయనకు మంగళగిరిలో ఊహించని దెబ్బ తగిలింది. మంగళగిరి మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల ఇవాళ వైఎస్సార్సీపీలో చేరారు. లోటస్ పాండ్‌లో వైఎస్ జగన్‌ను ఆమె ఇవాళ కలిశారు. అనంతరం వైఎస్సార్సీపీలో చేరారు. ఈసందర్భంగా వైఎస్ జగన్ ఆమెకు పార్టీ కండువా కప్పి వైసీపీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఇవాళ్టి వరకు లోకేశ్‌తో ప్రచారంలో తిరిగిన కమల.. ఒక్కసారిగా వైసీపీలో చేరడంతో నారా లోకేశ్ షాక్ అయ్యారట. మంగళగిరిలో టీడీపీ పరిస్థితి దారుణంగా మారుతుండటంతో ఏం చేయాలో తెలియక లోకేశ్ తలపట్టుకుంటున్నారట. టీడీపీ నేత‌లంద‌రూ వైసీపీలో చేరుతుండ‌టంతో మంగ‌ళ‌గిరిలో నారా లోకేశ్ గెలిచే అవ‌కాశాలు త‌గ్గుతున్న‌ట్టేన‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు భావిస్తున్నారు.

మాట తప్పినందుకే..

మంగళగిరి సీటును బీసీలకే కేటాయిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చి ఇప్పుడు తన కొడుకు ఇచ్చి మంగళగిరి ప్రజలను మోసం చేశారని కాండ్రు కమల విమర్శించారు. ఆమె వైసీపీలో చేరిన అనంతరం మీడియాతో మాట్లాడారు. ఇచ్చిన మాటను చంద్రబాబు నిలబెట్టుకోనందుకు దానికి నిరసనగా టీడీపీకి రాజీనామా చేస్తున్నట్లు కమల వెల్లడించారు.టీడీపీని ఓడించడానికి అందరూ కలిసి పనిచేయాలన్నారు. బీసీలకు చంద్రబాబు ఎంతో అన్యాయం చేశారన్నారు. అందుకే చంద్రబాబు మోసాలను బీసీలు గ్రహించాలని ఆమె సూచించారు. అధికారం కోసం చంద్రబాబు ఎన్నో కుయుక్తులకు పాల్పడుతున్నారని గుంటూరు జిల్లాలో తన సామాజిక వర్గానికే ఎక్కువ సీట్లు కేటాయించారని ఆమె తెలిపారు.

వైఎస్సార్సీపీ తరుపున మాత్రం గుంటూరు జిల్లాలో ముగ్గురు మహిళలకు అవకాశం కల్పించారని.. వైఎస్ జగన్ సామాజిక సమతుల్యతను పాటించారని అన్నారు. వైఎస్ జగన్‌కు ఒక్కసారి అవకాశం ఇవ్వండి.. రాజన్న పరిపాలనను మళ్లీ చూస్తారు.. ఆ నమ్మకం నాకుంది అని ఆమె ఈసందర్భంగా తెలియజేశారు.