ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో మునుగోడు ఉపఎన్నిక సందడి ఎక్కువ నడుస్తోంది..దీని వల్ల అన్నీ పార్టీలు మునుగోడుపైనే ఫోకస్ పెట్టాయి. అలాగే మీడియా ఫోకస్ కూడా మునుగోడుపైనే ఉంది. మునుగోడు హైలైట్ అవ్వడం వల్ల రాష్ట్రంలో ఇతర అంశాలు పెద్దగా హైలైట్ కావడం లేదు. ముఖ్యంగా టీఆర్ఎస్‌లో నడిచే అంతర్గత పోరు అంశం కాస్త వెనక్కి వెళ్లింది. అసలు టీఆర్ఎస్‌లో అంతర్గత పోరు ఏ స్థాయిలో ఉందో చెప్పాల్సిన అవసరం లేదు. దాదాపు సగం నియోజకవర్గాల్లో సొంత పార్టీ నేతలకు పడటం లేదు.
ఇప్పుడు అదే పరిస్తితి డోర్నకల్ నియోజకవర్గంలో కనిపిస్తోంది..ఇక్కడ ఎమ్మెల్యే రెడ్యానాయక్, మంత్రి సత్యవతి రాథోడ్‌ల మధ్య పోరు నడుస్తోంది. ఈ ఇద్దరు నేతలు వేరే పార్టీల నుంచి టీఆర్ఎస్‌లోకి వచ్చినవారే. రెడ్యానాయక్ కాంగ్రెస్ నుంచి వచ్చి 2018 ఎన్నికల్లో డోర్నకల్‌లో మరొకసారి ఎమ్మెల్యేగా గెలిచారు. అటు సత్యవతి టీడీపీ నుంచి వచ్చారు. అలాగే ఆమెకు ఎమ్మెల్సీ ఇవ్వడమే కాదు..మంత్రి పదవి కూడా ఇచ్చారు.
దీంతో డోర్నకల్‌లో పోరు మరింత ముదిరింది. గతంలో ఈ ఇద్దరు టీడీపీ-కాంగ్రెస్ నుంచి ప్రత్యర్ధులుగా పోటీ చేశారు. 2009లో సత్యవతి టీడీపీ నుంచి, రెడ్యా కాంగ్రెస్ నుంచి పోటీ చేశారు. అప్పుడు సత్యవతి గెలిచారు. తర్వాత సత్యవతి టీఆర్ఎస్‌లోకి వచ్చి 2014లో పోటీ చేశారు. అప్పుడు కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన రెడ్యా గెలిచారు. రెడ్యా కూడా టీఆర్ఎస్‌లోకి వచ్చారు. దీంతో 2018లో సీటు కోసం పోటీ నెలకొంది..చివరికి సత్యవతికి ఎమ్మెల్సీ ఇస్తామని చెప్పి..రెడ్యాని పోటీకి దింపారు. మళ్ళీ రెడ్యా గెలిచారు.
మళ్ళీ టీఆర్ఎస్ అధికారంలోకి రావడంతో సత్యవతికి ఎమ్మెల్సీ, మంత్రి పదవి ఇచ్చారు. దీంతో డోర్నకల్‌లో ఆధిపత్య పోరు పెరిగింది. ఓ వైపు రెడ్యా వర్గం, మరోవైపు సత్యవతి వర్గం దూకుడుగా పనిచేస్తున్నాయి. నెక్స్ట్ ఎన్నికల్లో సీటు దక్కించుకోవాలని ఎవరికి వారు ట్రై చేస్తున్నారు. అయితే ఆ మధ్య రెడ్యా తప్పుకుని..తన తనయుడు రవిచంద్రని పోటీలో పెట్టాలని చూశారు. అలా తనయుడుకు సీటు అడిగితే..సీటు దక్కడం కష్టమని, పైగా సత్యవతికి సీటు కేటాయిస్తారనే ఆలోచనతో..రెడ్యా చివరికి తానే పోటీ చేస్తానని చెప్పారు. అయినా సరే సత్యవతి వర్గం తగ్గడం లేదు..నెక్స్ట్ డోర్నకల్ సీటు సత్యవతికే అంటున్నారు. ఇలా డోర్నకల్ సీటు విషయంలో రెడ్యా వర్సెస్ సత్యవతి అన్నట్లు పోరు నడుస్తోంది. నెక్స్ట్ ఒకరికి సీటు ఇస్తే మరొకరు సహకరించే పరిస్తితి కనిపించడం లేదు. దీని వల్ల డోర్నకల్‌లో టీఆర్ఎస్‌కు డ్యామేజ్ జరిగేలా ఉంది.