ఎమ్మెల్సీ అభ్యర్ది ఎంపిక టీ కాంగ్రెస్ నేతల్లో చిచ్చు పెట్టిందా ?

-

తెలంగాణలో గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్‌ వచ్చేసింది. ఈ షెడ్యూల్‌ రావడానికి రెండు రోజుల ముందే కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా మాజీ మంత్రి చిన్నారెడ్డిని.. నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ అభ్యర్థిగా రాములు నాయక్‌ పేర్లను కాంగ్రెస్‌ ఖరారు చేసింది. చిన్నారెడ్డి ఎంపిక పై ఎలాంటి అభ్యంతరాలు లేకపోయినా రాములు నాయక్ ఎంపిక టీ కాంగ్రెస్ నేతల్లో కొత్త చిచ్చుపెట్టింది.

మెదక్‌ జిల్లాకు చెందిన రాములు నాయక్‌ నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీగా ఎలా పోటీ చేస్తారని ప్రశ్నిస్తున్నారు కాంగ్రెస్ లో కొందరు సీనియర్లు. దీనిపై పార్టీలో కొంత చర్చ కూడా జరిగింది. అయినా అధిష్ఠానం వాటిని పరిగణనలోకి తీసుకోలేదట. రాములు నాయక్‌ గతంలో టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీగా ఉన్నారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని టీఆర్‌ఎస్‌ ఆయన్ని సస్పెండ్‌ చేసింది. తర్వాత కాంగ్రెస్‌లో చేరారు రాములు నాయక్‌. మరి.. నాటి ఘటనలను గుర్తు చేసుకుందో ఏమో కాంగ్రెస్‌ పార్టీ ఆయనకు ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చింది.

అయితే అదే సామాజికవర్గానికి చెందిన కాంగ్రెస్‌ నేత బెల్లయ్యనాయక్‌ సైతం ఎమ్మెల్సీ టికెట్‌ ఆశించారు. ఇప్పుడు పార్టీ టికెట్‌ నిరాకరించడంతో ఆయన గుర్రుగా ఉన్నారట. ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్‌ మాణిక్యం ఠాగూర్‌, అభ్యర్థుల ఎంపిక కమిటీ ఇంఛార్జ్‌గా ఉన్న ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డిపై బెల్లయ్య నాయక్‌ మండిపడుతున్నారు.

ఈ నియోజకవర్గం పరిధిలోనే పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి బ్రదర్స్‌.. మాజీ మంత్రి జానారెడ్డి.. సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ఉన్నారు. వీరిలో ఎవరితోనూ రాములు నాయక్‌ టచ్‌లోకి వెళ్లలేదని పార్టీలోని ఒక వర్గం చెబుతోంది. కనీసం సమన్వయం చేసుకోవడానికి కూడా సంప్రదింపులు జరపకపోతే ఎలా మద్దతిస్తారని ఆ వర్గం ప్రశ్నిస్తోంది. బలమైన నాయకులు ఉన్న జిల్లాల్లో పొరుగు ప్రాంతాల వారిని బరిలో దించడానికి గల కారణాలు చెప్పకపోవడం.. సీటు ఆశించిన వారిని బుజ్జగించకపోవడంపై విమర్శలు చేస్తున్నారు.

ఇక టికెట్‌ వస్తుందన్న ఆశతో ఆర్థికంగా కొంత ఖర్చుపెట్టి ఓటర్లను నమోదు చేయించారు కొందరు కాంగ్రెస్‌ నాయకులు. వారెవరితోనూ పార్టీ పెద్దలు మాట్లాడలేదని చెబుతున్నారు. ఇలాంటి సమయంలో వెనక్కి తగ్గకూడదని భావిస్తున్న బెల్లయ్యనాయక్‌ ఇండిపెండెంట్‌గా పోటీ చేయాలని అనుకుంటున్నారట. అదే జరిగితే పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎవరు ఎటువైపు మొగ్గు చూపుతారన్నది చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version