తెలంగాణలో రాజకీయాల్లో హీట్ ఏ మాత్రం తగ్గలేదని స్వాతంత్ర్య దినోత్సవం రోజున కూడా నాయకులు చేసే విమర్శలని బట్టి అర్ధమవుతుంది. స్వాతంత్ర్య దినోత్సవం రోజున బీజేపీ కార్పొరేటర్ శ్రవణ్, మల్కాజిగిరి టీఆర్ఎస్ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు అనుచరుల మధ్య గొడవ జరిగిన విషయం తెలిసిందే. ఎమ్మెల్యే, కార్పొరేటర్‌ల మాట మాట పెరిగిన నేపథ్యంలో, ఎమ్మెల్యే అనుచరులు కార్పొరేటర్‌పై దాడి చేసినట్లు తెలుస్తోంది.
తమ కార్పొరేటర్‌పై ఎమ్మెల్యే అనుచరులు బీర్ బాటిల్స్, రాడ్లతో దాడి చేయడం దారుణమని బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఫైర్ అయ్యారు. లోకల్ ఎమ్మెల్యే గుండాయిజం చేస్తున్నారని, రేపటి నుంచి ఎమ్మెల్యే కబ్జాలన్నీ బయటకు తీస్తామని వార్నింగ్ ఇచ్చారు. ఇక మైనంపల్లి ఇలాంటి వ్యక్తి అని తెలిసే.. బీజేపీలో చేరతామని వచ్చినా పార్టీలో చేర్చుకోలేదని చెప్పారు.
అయితే ఇంతకాలం మైనంపల్లి పార్టీ మారుతారని ఎక్కడా కూడా వార్తలు రాలేదు. ఆయన టీఆర్ఎస్‌లో కీలకంగా వ్యవహరిస్తున్నారు. కానీ ఇప్పుడు మాత్రం మైనంపల్లి పార్టీలోకి వస్తానని అడిగినట్లు, రౌడీయిజం చేస్తారు కాబట్టే పార్టీలోకి తీసుకోలేదనే విధంగా బండి సంజయ్ చెబుతున్నారు. అంటే బండి సంజయ్ రాజకీయంగా విమర్శలు చేయాలని ఈ తరహా వ్యాఖ్యలు చేశారా…లేక నిజంగానే మైనంపల్లి బీజేపీలోకి రావడానికి ప్రయత్నించారా అనే అంశం ఆసక్తికరంగా మారింది. తెలంగాణ రాజకీయాల్లో కీలకంగా ఉన్న మైనంపల్లి గతంలో టీడీపీలో పనిచేశారు.
2014 ఎన్నికల్లో టికెట్ రాలేదని చెప్పి టీఆర్ఎస్‌లోకి వచ్చి మల్కాజిగిరి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత టీఆర్ఎస్‌లో ఎమ్మెల్సీ అయ్యారుయి. ఇక 2018 ఎన్నికల్లో టీఆర్ఎస్ తరుపున మల్కాజిగిరి ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించారు. ఇలా టీఆర్ఎస్‌లో ఉన్న మైనంపల్లి, బీజేపీలోకి ఎప్పుడు రావాలని అనుకున్నారు? ఎందుకు రావాలని అనుకున్నారు? అనేది అర్ధం కాకుండా ఉంది. అధికార పార్టీలో ఉన్న ఒక ఎమ్మెల్యే పార్టీ మారాలని చూసారా? అంటే కాస్త నమ్మడానికి కష్టంగానే ఉంది. మరి బండి సంజయ్ మాటల్లో నిజం ఎంత ఉందో? ఆయనకు, మైనంపల్లికే తెలియాలి.