గ్రేటర్ హైదరాబాద్ లో పట్టుకోసం కాంగ్రెస్ కొత్త వ్యూహం.. నాలుగు భాగాలుగా విభజన.. మంత్రి వ్యాఖ్యలతో పొలిటికల్ గా చర్చ..

-

గత ఎన్నికల్లో తెలంగాణాలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది.. గ్రామీణ ప్రాంతాల్లో ఉండేవారందరూ కాంగ్రెస్ కు జైకొట్టారు.. దీంతో పదేళ్లపాటు అధికారంలో ఉన్న బిఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షానికే పరిమితమైంది.. రాష్టమంతా హవా చాటిన కాంగ్రెస్.. గ్రేటర్ హైదరాబాద్ లో మాత్రం చతికిలపడింది.. కాంగ్రెస్‌కు జీహెచ్ఎంసీ పరిధిలో ఒక్క అసెంబ్లీ సీటు కూడా రాలేదు. దీంతో ఇక్కడ బలం పెంచుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది.. త్వరలో జరిగే జీహెచ్ఎంసీ ఎన్నికల్లోపు పట్టు సాధించాలని భావిస్తోంది..

గ్రేటర్ హైదరాబాద్ లో బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎక్కువగా ఉన్నారు.. దీంతో ఇక్కడ బలం పుంజుకోవాలంటే.. అది ఇప్పుడు సాధ్యపడదు..దీంతో గ్రేటర్ హైదరాబాద్ ను విభజించాలనే ఆలోచనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.. ఇటీవల మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఇదే విషయాన్ని బయటపెట్టారు.. అభివృద్ది కోసం జీహెచ్ఎంసీని నాలుగు భాగాలుగా విభజిస్తామని ఆయన ప్రకటించారు.. ఈ స్టేట్మెంట్ రాజకీయవర్గాల్లో లోతైన చర్చలకు దారి తీస్తోంది.. రాజకీయంగా జీహెచ్ఎంసీపై పట్టు సాధించేందుకు ప్రభుత్వం ఈ ప్రతిపాదన తెచ్చిందా అనే టాక్ వినిపిస్తోంది..

జీహెచ్ఎంసీని నాలుగు భాగాలుగా విభజించాలని రేవంత్ రెడ్డి సర్కార్ భావిస్తోందట.. ప్రస్తుతం జీహెచ్‌ఎంసీలో 150 డివిజన్లలో 1.50 కోట్ల జనాభా ఉంది. శివారులోని ఏడు మున్సిపల్ కార్పోరేషన్లు, 30 మున్సిపాలిటీల్లో 60 లక్షల జనాభా ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.. వీటిని జీహెచ్ఎంసీలో విలీనం చేస్తే జనాభా రెండు కోట్లు దాటుతుంది. ఓఆర్ఆర్ వెలుపల ఉన్న మరో 10 పంచాయితీలను జీహెచ్ఎంసీలో విలీనం చేయాలని మున్సిపల్ శాఖ ప్రతిపాదనలు చేసింది. వీటన్నింటిని కలిపి గ్రేటర్ సిటీ కార్పోరేషన్‌గా ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన తెరమీదికి వచ్చింది.

జీహెచ్ఎంసీని తూర్పు, పశ్చిమ, ఉత్తర, దక్షిణం పేరుతో నాలుగు కార్పోరేషన్లుగా చేయాలా లేదా రెండు కార్పోరేషన్లు చేయాలనే చర్చ కూడా ప్రభుత్వంలో జరుగుతోంది.. అయితే నాలుగు కార్పోరేషన్లుగా విభజించాలనే ప్రతిపాదనపై అధ్యయనం చేయాలని సీఎం అధికారులను ఆదేశించారని అధికారవర్గాల్లో ప్రచారం జరుగుతోంది.. ఇది జరిగితే.. కాంగ్రెస్ రాజకీయంగా బలపడే అవకాశముందని పొలిటికల్ అనలిస్టులు అభిప్రాయపడుతున్నారు.. అధికారంలో ఉన్న సమయంలోనే గ్రేటర్ లో బలం పెంచుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి ఆలోచనట.. అందుకోసమే ఈ ప్రతిపాదనలు తెరమీదకొచ్చినట్లు ప్రచారం జరుగుతోంది.. దీనిపై ప్రతిపక్షాలు ఎలా స్పందిస్తాయో చూడాలి..

Read more RELATED
Recommended to you

Exit mobile version