తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రతిపక్ష బిఆర్ఎస్ టార్గెట్‌గా చెలరేగిపోయారు. గత ప్రభుత్వం చేసిన తప్పులను ఒక్కొక్కటిగా బయటకి తీశారు. కేసీఆర్ లక్ష్యంగా అవినీతి,అక్రమాలను బయటపెట్టారు.ఇందులో ఫోన్ ట్యాపింగ్ అంశం కూడా ఒకటి. కాలేశ్వరం ప్రాజెక్ట్‌లో అక్రమాలు,సుంకిశాల వివాదం వంటివి రేవంత్ వెలుగులోకి తీసుకువచ్చారు. అయితే తెలంగాణ రాష్ర్టాన్ని వరుసగా వరదలు ముంచెత్తుతున్నాయి.
ఈ క్రమంలో రేవంత్ రెడ్డి బయటికి తీసిన అక్రమాలన్నీ తెరమరుగైపోయాయి. గత కొద్ది రోజులుగా అసలేమాత్రం చర్చకు లేకుండా పోయిన ఫోన్ ట్యాపింగ్ అంశం కూడా మరుగున పడిపోయింది.అయితే ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి పుణ్యమా అని మరోసారి తెరమీదకొచ్చింది. తన ఫోన్ ను రాష్ట్ర ప్రభుత్వం ట్యాప్ చేస్తోందని, కరీంనగర్ సీపీ ఫోన్ కూడా ట్యాప్ చేసున్నారని ఆయన ఆరోపించారు.ఆయన చేసిన ఆరోపణలు రాష్ర్టంలో కలకలం రేపుతున్నాయి.
కౌశిక్ రెడ్డి ఫోన్ ను ప్రభుత్వం ట్యాపింగ్ చేసిందా..? లేదా అనేది అటుంచితే ఆయన లేవనెత్తిన ఈ అంశం బీఆర్ఎస్ ను ఇరుకున పెట్టేలా ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. బీఆర్ఎస్ హయాంలో ప్రతిపక్ష పార్టీలకు చెందిన కీలక నేతలు, జర్నలిస్టుల ఫోన్లను ట్యాప్ చేసినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావుతోపాటు మాజీ డిఎస్పీ ప్రణీత్ రావు, రాధా కిషన్ రావు పలువురు అధికారులపై కేసులు నమోదు అయ్యాయి.
అయితే, ఇదంతా బీఆర్ఎస్ బాస్ ఆదేశాల మేరకు చేసినట్లుగా రాధకిషన్ రావు చెప్పినట్లుగా ప్రచారం జరిగింది. ఈ కేసుకు సంబంధించి ప్రభాకర్ రావును విచారించిన తర్వాత కేసీఆర్ ను నోటీసులు ఇస్తారనే వాదనలు వినిపించాయి. అనారోగ్య కారణాలను సాకుగా చూపిస్తూ అమెరికాలో ఉంటున్న ప్రభాకర్ రావు మరికొద్ది రోజుల్లోనే స్వదేశానికి రానున్నారని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే కేటీఆర్ అమెరికా వెళ్ళడంపై వివాదం చెలరేగుతోంది.
కెటిఆర్ అమెరికా పర్యటనపై అటు కాంగ్రెస్ పార్టీ సైతం తీవ్ర ఆరోపణలు చేస్తోంది.ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావుకు కీలక సూచనలు ఇచ్చేందుకే కెటిఆర్ అమెరికా పర్యటనకు వెళ్ళారని విమర్శలు వస్తున్నాయి.ఈ విమర్శలు కొనసాగుతుండగా పాడి కౌశిక్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ అంటూ వాయిస్ వినిపించడంతో గత ఫోన్ ట్యాపింగ్ అంశం మళ్ళీ తెరమీదకి వచ్చింది.
ప్రెస్‌మీట్ పెట్టిన ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి జనాల్లో చర్చ లేకుండా పోయిన ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని చర్చకు పెట్టి.. కేటీఆర్ ను బుక్ చేశారన్న టాక్ నడుస్తోంది.దీంతో బీఆర్ఎస్ శ్రేణులు మరోసారి ఉలిక్కిపడ్డాయి. ఈ నెలలోనే ప్రజల్లోకి రావాలని కెసీఆర్ ప్లాన్ రెడీ చేసుకుంటుండగా కౌశిక్‌రెడ్డి రూపంలో మరోవివాదం చుట్టుముట్టింది.దీని పర్యవసానం ఎలా ఉంటుందో చూడాలి మరి.