తెలంగాణలో ఇప్పుడు ఏదైనా చర్చనీయాంశమైన టాపిక్ ఉందా అంటే అది ఒక్క హుజూరాబాద్ మాత్రమే. ఎందుకంటే గత చరిత్రలో ఎన్నడూ లేనంతగా ఒక్క ఉప ఎన్నిక అన్ని పార్టీలను శాసిస్తోంది. ఒక్క ఉప ఎన్నిక కోసం ఏకంగా ప్రభుత్వం కొత్త స్కీములు పెట్టే వరకు వచ్చింది అంటే ఎంతలా దాని ప్రభావం ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక రేవంత్ రెడ్డి టీపీసీసీ చీఫ్ కావడమేంటో ఆ పార్టీ కూడా మంచి పోటీ ఇచ్చే అవకాశం ఉంది. ఇందుకోసం ఇప్పటికే అంతా రెడీ చేస్తున్నారు.
ఇక కాంగ్రెస్ తరఫున కౌశిక్ రెడ్డి పోటీ చేస్తారని భావించినా చివరకు ఆయన గులాబీ కండువా కప్పుకున్నారు. దీంతో ఇప్పుడు రేవంత్‌కు మళ్లీ పెద్ద సమస్య వచ్చింది. ఈటల రాజేందర్ లాంటి కీలక నేతలు ఢీ కొట్టాలంటే అంతే ఇమేజ్ ఉన్న నేతను దింపాలని భావిస్తున్నారు కాంగ్రెస్ నేతలు. ఇప్పటికే మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ పేరు తెరమీదకు వచ్చినా విమర్శలు, వ్యతిరేకత వస్తుందనే భయంతో ఆయన్ను పక్కన పెట్టారు రేవంత్.
ఇక ఇప్పుడు రేవంత్ మదిలో మరో కీలక నేత అయిన పత్తి కృష్ణారెడ్డి పేరు వినిపిస్తోంది. ఈయనకు కౌశిక్ రెడ్డి లాగే హుజూరాబాద్‌లో కాంగ్రెస్ తరఫున మంచి ఇమేజ్ ఉంది. 2018లోనే టికెట్ దక్కాల్సి ఉన్నా అది చివరకు ఉత్తమ్‌కు కౌశిక్ దగ్గరి బంధువు కావడంతో దక్కలేదు. దీంతో ఇప్పుడు మళ్లీ ఆయన పేరు తెరమీదకు వచ్చింది. రైతు సంఘం ఉద్యమనాయకుడిగా నియోజకవర్గంలో కృష్ణారెడ్డికి మంచి గుర్తింపు ఉంది. మొదటి నుంచి ఉద్యమ నేపథ్యం ఉన్న కృష్నారెడ్డి అయితేనే బాగుంటుందని రేవంత్ భావిస్తున్నారంట.