తన నోటి నుంచి కానీ… తన అధికార సోషల్ మీడియా మాధ్యమాలద్వారా కానీ వస్తే అది పార్టీకి బాధ్యత అని.. అలా కాకుండా మిగిలిన జనసేన నాయకులు ఎవరు స్పందించినా… దాన్ని పార్టీ అభిప్రాయంగా పరిగణించొద్దని, అది వారి వ్యక్తిగత అభిప్రాయం అని చెప్పుకొస్తున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్! అంటే… వ‌్యక్తిగతంగా స్పందించే హక్కు జనసేనలోని ఇతర నేతలకు ఉంటుందా? ఉండదా? అనే అనుమానం పుష్కలంగా కలిగేలా స్పందించిన పవన్… నాగబాబు వ్యవహారంపై పూర్తి కన్ఫ్యూజ్డ్ కామెంట్లతో స్పందించారు!
జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు నాగబాబు సోషల్ మీడియా ద్వారా వ్యక్తం చేస్తున్న అభిప్రాయాలు పూర్తిగా ఆయన వ్యక్తిగతమైనవని, వాటితో జనసేన పార్టీకి ఎలాంటి సంబంధం లేదంటూ ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. ఈ మేరకు జనసేన పార్టీ మీడియా విభాగం పేరుతో ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు! జనసేనలో ఉండే నాయకులు, కార్యకర్తలు, అభిమానులు సామాజిక మాధ్యమాలలో వ్యక్తం చేసే అభిప్రాయాలు వారి వారి వ్యక్తిగత అభిప్రాయాలు మాత్రమే.. వాటితో పార్టీకి ఎలాంటి సంబందం లేదు అని! ఇక్కడే పవన్ అపరిపక్వ రాజకీయం బయటపడుతుందని అంటున్నారు విశ్లేషకులు!
జనసేన అంటే… అధికారికంగా తానొక్కడినే అని, మిగిలినవారంతా ఆటలో అరటిపండ్లే అని చెప్పేలా పవన్ వ్యాఖ్యలు ఉన్నాయనేది పలువురి అభిప్రాయంగా ఉంది!! టీవీ ఛానల్స్ లోనూ, పత్రికల ముందూ మాట్లాడే జనసేన నాయకుల మాటలకు కూడా అధికారికంగా పార్టీతో ఎలాంటి సంబందం లేదని పవన్ చెప్పాలనుకుంటున్నారా? లేక నాగబాబు వ్యవహారం బీజేపీకి వ్యతిరేకంగా ఉండటం వల్ల… నాగబాబు అభిప్రాయాలకు మాత్రమే ఈ రూల్ వర్తిస్తుందా అనేది ఇక్కడ పెద్ద ప్రశ్నే!! ఎందుకంటే… ఏ టీవీ ఛానల్ డిబేట్ కి అయినా… పలానా పార్టీ నేత అనే పిలుస్తారు, వారు కూడా అలానే స్పందిస్తారు కదా!!
ఏది ఏమైనా… నాగబాబు అభిప్రాయాలు పూర్తిగా ఆయన వ్యక్తిగతం, పార్టీకి ఎలాంటి సంబంధం లేదు అని చెబుతున్న పవన్… నాగబాబుకు జనసేనతో సంబంధం ఉన్నట్టా? లేనట్టా? అనే విషయంపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు! ఇదే క్రమంలో… వ‌్యక్తిగతంగా స్పందించే హక్కు పవన్ కు తప్ప జనసేనలోని ఇతర నేతలు ఎవరికీ ఉండదా అనే విషయంపై కూడా పవన్ క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది! ఈ సందర్భంలో… పవన్ ఇంకా బలంగా, తెలివిగా ఆలోచిస్తూ రాజకీయం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందనేది ఆయన శ్రేయోభిలాషుల అభిప్రాయం!!