మస్ట్ రీడ్: టాలీవుడ్ లో “పవర్” ఇంతేనా?  

-

ఇండస్ట్రీలోనూ బయటా… ఆయన్ని “పవర్ స్టార్” అంటారు. ఆయన పేరు చెప్పుకుంటూ చిన్నాచితకా సినిమాలు ప్రమోట్ అవుతూకూడా ఉంటాయి! తమిళనాడులో రజనీకాంత్ స్థాయి.. టాలీవుడ్ లో పవన్ ది అని చెప్పేవారూ ఉంటారు! వేదిక ఏదైనా పవన్ ని పొగడటానికి ఉత్సాహం చూపిస్తుంటారు కొందరు ఇండస్ట్రీ జనాలు! మరి అలాంటి పవర్ స్టార్ కి టాలీవుడ్ లో ఉన్న పవర్ ఎంత? ప్రస్తుతం సగటు సినిమా అభిమానికి వస్తోన్న సందేహం ఇది!

“రిపబ్లిక్” ప్రీ-రిలీజ్ ఈవెంట్ లో ఏపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పవన్ ఆవేశపూరిత ప్రసంగం చేయడంతో మొదలైన వివాదం కొనసాగుతూనే ఉంది. రూపాలు మార్చుకుంటుంది తప్ప.. ఆ వివాదం సద్దుమణగడం లేదు! అందులో భాగంగా… పవన్ పై ఏపీ మంత్రులు – వైసీపీ మద్దతుదారులు తీవ్ర వ్యాఖ్యలతో విరుచుకుపడగా… సినీ నటుడు దర్శకనిర్మాత పోసాని కృష్ణ మురళీ పదునైన విమర్శలు చేశారు. సరిగ్గా గమనిస్తే… ఈ మొత్తం వ్యవహారంలో పవన్ కి ఇండస్ట్రీ నుంచి ఉన్న మద్దతు అతి అతి స్వల్పం!

పవన్ కళ్యాణ్ లేవనెత్తిన అంశాలపై ఇండస్ట్రీలో నాని – కార్తికేయ వంటి హీరోలు మద్దతు తెలుపుతూ ట్వీట్స్ చేశారే తప్ప… ఆ ప్రకటనలకు సపోర్ట్ గా టాలీవుడ్ ప్రముఖులు ఎవరూ బయటకు రాలేదు. పైగా… పవన్ వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతం – ఆ కామెంట్స్ తో ఇండస్ట్రీకి ఏమీ సంబంధం లేదంటూ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ – ప్రొడ్యూసర్స్ కౌన్సిల్లు ప్రకటన విడుదల చేశారు. ఇదే క్రమంలో… “మా” అధ్యక్ష బరిలో నిలిచిన మంచు విష్ణు, అతని ప్యానల్… తాము ఇండస్ట్రీ వైపు ఉంటామని, పవన్ కామెంట్స్ తో ఏకీభవించమని చెప్పేశారు!

ఇవన్నీ ఒకెత్తు అయితే… చిరంజీవి కూడా ఇండస్ట్రీకి పవన్ కల్యాణ్ వ్యాఖ్యలతో సంబంధం లేదని పేర్కొన్నారు.

ఇక తాజాగా జరుగుతున్న “పోసాని – పవన్” రచ్చ విషయంలో కూడా పవన్ కు ఎవరూ మద్దతుగా నిలుస్తున్నట్లు కనిపించడం లేదు! అవును… పవన్ కళ్యాణ్ మీద పోసాని కృష్ణ మురళి చేసిన అసభ్యకరమైన, అభ్యంతరకరమైన వ్యాఖ్యలను తమ్మారెడ్డి భరద్వాజ్ మినహా ఇండస్ట్రీలోని పెద్దలు ఎవరూ ఖండించలేదు. విచిత్రంగా… మెగా క్యాంప్ కూడా ఈ వ్యవహారం పై మౌనం గానే ఉంది! దీంతో… పవన్ కు ఇండస్ట్రీలో ఉన్న “పవర్” ఇంతేనా అనే కామెంట్లు దర్శనమిస్తున్నాయి! ఈ నేపథ్యంలో పవన్ భవిష్యత్తు కార్యాచరణ ఏమిటి అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి!

Read more RELATED
Recommended to you

Exit mobile version