రాజధాని రైతుల ఆందోళనలు 50వ రోజుకి చేరుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే రాజధాని రైతులు వినూత్న నిరసనలు చేపట్టనున్నారు. చేతి వృత్తులు, కుల వృత్తులు చేసే వారితో కలిపి నేడు నిరసనలు చేయనున్నారు. ఇదిలా ఉంటే.. రాజధాని అమరావతిని తరలించవద్దంటూ రైతులు, ఆడపడచులు నిరాహారదీక్షలు, ఆందోళనలు మొదలుపెట్టి యాభై రోజులు పూర్తయ్యాయని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. రైతులు, ఆడపడుచుల సడలని ఉద్యమ స్ఫూర్తి, వారు అనుసరిస్తున్న శాంతియుత పంథా చూసి తెలుగువాళ్లు గర్విస్తున్నారని తెలిపారు.
రోడ్డునపడ్డ రైతులకు అండగా ఉంటానని గతంలోనే మాటిచ్చానని, ఈ నెల 10 తర్వాత మరోసారి రాజధాని ప్రాంతంలో పర్యటిస్తానని చెప్పారు. రైతుల వాణి దేశం నలుమూలలా వినిపించేలా నినదిస్తానని, రైతుల ఉద్యమానికి మరోసారి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్టు చెప్పారు. అయితే ఈ సారి అమరావతి పర్యటనలో పవన్ కళ్యాణ్ రైతుల నుంచి ప్రశ్నలను ఎదుర్కొనే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది. కొద్ది రోజుల క్రితం బీజేపీతో పొత్తు పెట్టుకున్న పవన్ కళ్యాణ్… కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చి రాజధాని తరలింపును అడ్డుకుంటారనే ప్రచారం గతంలో జరిగింది. అయితే ఆ తరువాత ఇధి రాష్ట్ర పరిధిలోని అంశమని ఆయన కూడా స్పష్టం చేశారు. మరి దీంతో పవన్ అమరావతి పర్యటనపై ఎలా స్పందిస్తారో చూడాలి.