చంద్ర‌బాబు కంసుడులాంటివాడు: పేర్ని నాని

-


విజయవాడ: ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆశావర్కర్ల సమస్యలు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడికి గుర్తుకు వస్తున్నాయని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి పేర్నినాని విమర్శించారు. విజయవాడలోని వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ..గర్బిణీలను ప్రసవానికి తీసుకెళ్లేటప్పుడు కూడా తన గురించి చెప్పాలంటూ ఆశావర్కర్లకు చంద్రబాబు సూచించడం విడ్డూరంగా ఉందన్నారు. బిడ్డ పుట్టి ఓటు హక్కు వచ్చిన తర్వాత తనకే ఓటు వేస్తారని చంద్రబాబు పేర్కొనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. కంసుడు లాంటి చంద్రబాబు నాయుడి గురించి ప్రతి తల్లీ తన బిడ్డకు వివరిస్తుందని ఎద్దేవా చేశారు. ఆశావర్కర్లు గతంలో జీతాలు పెంచమని అడిగితే పోలీసు లాఠీలతో కొట్టించిన చరిత్ర చంద్రబాబుదని గుర్తు చేశారు.

రాజకీయాల్లో మగతనం ఉండదు పవన్‌
తెలంగాణా నాయకులను విమర్శించని వైఎస్‌ జగన్‌కు మగతనం లేదని పవన్‌ విమర్శించడాన్ని పేర్నినాని తప్పుబట్టారు. రాజకీయాల్లో మగతనం ఉండదని, నాయకత్వంతోనే ప్రజల విశ్వాసం పొందాలని వ్యాఖ్యానించారు. గత ఎన్నికల సమయంలో టీడీపీ, బీజేపీ తరపున ప్రచారం చేసి, వారిచ్చే హామీలకు తనది పూచీకత్తు అని, ప్రశ్నించడానికే తాను పార్టీ పెట్టానని చెప్పిన పవన్‌ కల్యాణ్‌ నాలుగేళ్లు ఎందుకు నిద్రపోయారని ప్రశ్నించారు. ఎన్నికలు ఏడాది ఉండగా పవన్‌ కళ్లు తెరిచారని, పాలక ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సింది పోయి ప్రతిపక్షాన్ని విమర్శించడం విడ్డూరంగా ఉందన్నారు. అగ్రిగోల్డ్‌, ఫాతిమా కాలేజీ సమస్యలపై పవన్‌ చేసిన ప్రకటనలు ఏమయ్యాయని, వారి పట్ల పవన్‌ కల్యాణ్‌ చేసిన పోరాటం ఏంటో చెప్పాలని సూటిగా అడిగారు. రాజదాని రైతులకు అండగా ఉంటానని చెప్పిన హామీని పవన్‌ గాలికి వదిలేశారని దుయ్యబట్టారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version