కాంగ్రెస్ రూ.50 లక్షల ఆఫర్ ఇచ్చింది: ఎమ్మెల్యే రేగా కాంతారావు

-

కాంగ్రెస్ లో చేరిన రేవంత్ రెడ్డి, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, యాదవరెడ్డిని ఎంత డబ్బు పెట్టి కొన్నారని ఆయన ఉత్తమ్ ను ప్రశ్నించారు.

తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎమ్మెల్యేలకు కాంగ్రెస్ పార్టీ భారీ ఆఫర్లు ప్రకటించింది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల కోసం సొంత పార్టీ ఎమ్మెల్యేకే కాంగ్రెస్ పార్టీ 50 లక్షల రూపాయల ఆఫర్ ఇచ్చిందట. ఈ విషయాన్ని కాంగ్రెస్ ఎమ్మెల్యే రేగా కాంతారావు మీడియాకు వెల్లడించారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కుతో కలిసి పినపాక ఎమ్మెల్యే రేగ కాంతారావు మీడియాతో మాట్లాడారు. ఈసందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆఫర్ గురించి ఆయన మీడియాకు వెల్లడించారు.

మేం డబ్బులకు అమ్ముడుపోయేవాళ్లం కాదు..

ఒకవేళ తాము నిజంగా ఉత్తమ్ విమర్శించినట్టుగా డబ్బులకు అమ్ముడుపోయేవాళ్లమే అయితే.. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన భారీ ఆఫర్ 50 లక్షలను తీసుకొని ఉండేవాళ్లం కదా. కానీ.. మేం డబ్బులకు అమ్ముడుపోయో.. ఇంకా దేనికోసమో టీఆర్ఎస్ పార్టీలో చేరడం లేదు. కేవలం ఆదివాసీల అభివృద్ధి కోసమే టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నాం. మాకు పదవి మీద ఎటువంటి వ్యామోహం లేదు. అవసరమైతే ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసి అయినా మళ్లీ పోటీ చేస్తాం.. అని రేగా కాంతారావు స్పష్టం చేశారు.

ఆదివాసీల ఆత్మగౌరవం దెబ్బతినేలా.. సిగ్గు లేకుండా ఉత్తమ్, భట్టీ మాట్లాడారని.. వారిద్దరూ మాట్లాడే పద్ధతిని మార్చుకోవాలని రేగా హితువు పలికారు. కాంగ్రెస్ లో చేరిన రేవంత్ రెడ్డి, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, యాదవరెడ్డిని ఎంత డబ్బు పెట్టి కొన్నారని ఆయన ఉత్తమ్ ను ప్రశ్నించారు. తాము టీఆర్ఎస్ పార్టీలో చేరితే కాంగ్రెస్ ఉండే ఎమ్మెల్యేల సంఖ్య 16 మాత్రమేనని.. 16 మంది ఎమ్మెల్యేలతో వీళ్లు ఏం చేస్తారని రేగా ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఎందుకు ఓడించారో ఇప్పటికైనా కాంగ్రెస్ నేతలు తెలుసుకోవాలని రేగా కాంతారావు సూచించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version