తమ జిల్లాకు అంబేద్కర్ పేరు పెట్టవద్దంటూ అమలాపురం పరిసర ప్రాంతాల్లో రేగిన అలజడలకూ మరియు అల్లర్లకూ ప్రధానంగా కారణం అయిన వారి పేర్లు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. అల్లర్లలో బాధ్యులుగా ఉన్నవారిలో మంత్రి పినిపే విశ్వరూప్ అనుచరుల పేర్లు ప్రధానంగా వినిపిస్తూ ఉన్నాయి. సత్య రుషి, వాసంశెట్టి సుభాష్, వట్టపర్తి మురళీ కృష్ణ, మట్టపర్తి రఘు పేర్లు ప్రధానంగా వినిపిస్తూ ఉన్నాయి. అయితే ప్రధాన నిందితులంతా పరారీలోనే ఉన్నారని తెలుస్తోంది.
పోలీసులు వీరి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. పోలీసుల అదుపులో ఉన్న ఎ222 ఇచ్చిన వాంగ్మూలం అనుసారం పోలీసులు ఈ నలుగురు నిందితులనూ గుర్తించారని ప్రాథమిక సమాచారం. గత నెలలో చోటుచేసుకున్న అల్లర్లకు సంబంధించి ఇప్పటికే రెండు వందల మందికి పైగా నిందితులను గుర్తించారు. వీరిలో చాలా మందిపై నాన్ బెయిల్ బుల్ కేసులు కూడా నమోదు చేశారు.
కాగా గత కొద్దికాలంగా ఈ కేసుకు సంబంధించి దర్యాప్తు వేగంగా సాగుతున్నా కొన్ని రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయన్న ఆరోపణలూ ఉన్నాయి. అయితే వీటి సంగతి ఎలా ఉన్నా రోజురోజుకూ అల్లర్ల నిందితులను గుర్తించే క్రమంలో మాత్రం పోలీసులు కొంత పరిణితి సాధిస్తున్నారనే చెప్పాలి. ఈ క్రమంలోనే కొందరు నిందితుల నుంచి వాంగ్మూలం సేకరించారు. వీటి ఆధారంగా మరికొందరి వివరాలు సైతం సేకరిస్తున్నారు. ప్రస్తుతానికి రాజకీయ నాయకుల ఆరోపణలు, ప్రత్యారోపణలు తగ్గిన రీత్యా కేసు దర్యాప్తు అయితే కాస్త వేగం అందుకుంది.
ఇదిలా ఉంటే అల్లర్లలో మంత్రి ఇంటిని ఆందోళనకారులు (?) తగులబెట్టిన తీరు పై కూడా అప్పట్లో అనేక అనుమానాలు వ్యక్తం అయ్యాయి. ఇదంతా డ్రామా అంటూ కొందరు విపక్ష సభ్యులు మండిపడ్డారు. వాటినే నిజం చేస్తూ తాజాగా మంత్రి అనుచరులే నిందితులు అని తేలిపోవడంతో పోలీసులు ఇకపై వీరిపై ఎటువంటి చర్యలు తీసుకోనున్నార న్న చర్చ కూడా నడుస్తోంది.