ఎన్నికల షెడ్యూల్, పోలింగ్ సమయాల్లో దుర్ముహూర్తాలు ఉన్నాయట.. నేతల్లో మొదలైన గుబులు..!

-

లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన సమయం ఇప్పుడు రెండు తెలుగు రాష్ర్టాల సీఎంలతోపాటు ఆయా పార్టీలకు చెందిన నేతలను భయపడేలా చేస్తోంది. నిన్న సాయంత్రం 5 గంటలకు లోక్‌సభ షెడ్యూల్‌ను విడుదల చేసిన సమయం మంచిది కాదట.

లోక్‌సభ ఎన్నికలతోపాటు, అటు నాలుగు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికలకు కూడా కేంద్ర ఎన్నికల సంఘం నిన్న షెడ్యూల్‌ను విడుదల చేసిన విషయం విదితమే. నిన్న సాయంత్రం 5 గంటలకు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సునీల్ అరోరా ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేశారు. అయితే షెడ్యూల్ విడుదలైన సమయం పట్ల ఇప్పుడు రెండు తెలుగు రాష్ర్టాల నేతలతోపాటు అటు దక్షిణాది రాష్ర్టాలకు చెందిన నేతలు కూడా గుబులుగా ఉన్నట్లు తెలిసింది. సహజంగానే ముహుర్తాలు, పంచాంగంపై నమ్మకం ఉండే నేతలను.. ఇప్పుడు ఎన్నికల షెడ్యూల్ విడుదలైన సమయం మాత్రమే కాదు, పోలింగ్ తేదీన ఉన్న దుర్ముహుర్తాలు కూడా కలవర పెడుతున్నాయి.

తెలుగు రాష్ర్టాల్లోని ప్రజలు ఏ పని చేసినా, కొత్త వ్యాపారం ప్రారంభించినా, కొత్త వస్తువు కొనుగోలు చేసినా.. పంచాంగం, ముహూర్తాలు చూసుకుని మరీ చేస్తారనే విషయం తెలిసిందే. అదేబాటలో పలువురు రాజకీయ నాయకులు కూడా ఏ పని చేసే ముందైనా మంచి ముహూర్తం కోసం చూస్తుంటారు. ముఖ్యంగా తెలంగాణ సీఎం కేసీఆర్‌తోపాటు అటు ఏపీ సీఎం చంద్రబాబు కూడా ముహూర్తాలు, పంచాంగం పట్ల అమితమైన నమ్మకం కలిగి ఉంటారు. ఈ క్రమంలోనే లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన సమయం ఇప్పుడు రెండు తెలుగు రాష్ర్టాల సీఎంలతోపాటు ఆయా పార్టీలకు చెందిన నేతలను భయపడేలా చేస్తోంది. నిన్న సాయంత్రం 5 గంటలకు లోక్‌సభ షెడ్యూల్‌ను విడుదల చేసిన సమయం మంచిది కాదట. ఆ సమయంలో రాహుకాలం ఉందట. దీంతో ఈ ఎన్నికలపై ముహూర్తం ప్రభావం ఎలా ఉంటుందోనని నేతలు దిగులు చెందుతున్నారట.

మరోవైపు అటు కర్ణాటకకు చెందిన జేడీఎస్ నేతలు కూడా పంచాగాన్ని, ముహూర్తాలను బాగా నమ్ముతారు. ఈ క్రమంలో వారు కూడా లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన సమయం మంచిది కాదని తెలిసి ఆందోళన చెందుతున్నారట. ఇక పోలింగ్ రోజున కూడా చాలా దుర్ముహూర్తాలు ఉన్నాయట. ఏప్రిల్ 11న ఉయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కానుండగా ఆ సమయంలో యమగండం ఉందట. అలాగే ఉదయం 9.12 గంటల నుంచి 10.44 గంటల వరకు గుళిక కాలం, 1.49 గంటల నుంచి 3.22 గంటల వరకు రాహుకాలం, తరువాత సాయంత్రం మరో 2 గంటల పాటు వర్జ్యం ఉన్నాయట. దీంతో ఆయా రాజకీయ పార్టీలకు చెందిన నేతలకు ఇప్పుడు ఈ ముహూర్తాలపై బెంగ పట్టుకుంది. దీంతో ఎన్నికల్లో గెలుస్తామా, లేదా అని కొందరు దిగులు చెందుతున్నారట.

అయితే మరికొందరు మాత్రం.. ఠాట్.. ఈ పంచాంగాలు, ముహూర్తాల గొడవ ఏమిటి..? గతంలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన సమయం, పోలింగ్ రోజు మంచి ముహూర్తాలు లేవు కదా.. కానీ తెరాస సర్కారు మళ్లీ అధికారంలోకి వచ్చింది కదా.. కనుక దుర్ముహూర్తాలు.. అంటూ దిగులు చెందాల్సిన పనిలేదని.. పలువురు అంటున్నారు. ఏది ఏమైనా.. ఇప్పుడీ ముహూర్తాల విషయంలో మాత్రం నేతలకు కొంత భయం పట్టుకుందనే చెప్పవచ్చు..!

Read more RELATED
Recommended to you

Exit mobile version