తెలంగాణ రాష్ట్ర బీజేపీలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. పార్టీని విస్తృత పరిచేందుకు అధిష్ఠానం చకచక పావులు కదుపుతోంది. అందులో భాగంగానే రాష్ట్రంలో పార్టీని సమర్థవంతంగా నిర్వహించేందుకు పార్టీ వాయిస్‌ను జనంలోకి బలంగా తీసుకెళ్లేందుకు అధ్యక్ష పీఠంపై మార్పు అవసరం గుర్తించినట్లుగా కొన్ని రోజులుగా జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారంలో నిజం ఉందని వెల్లడించే వాస్తవం బుధవారం చోటు చేసుకుంది.
ప్రస్తుతం రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగుతున్న లక్ష్మణ్‌ను దించేసి.. ఆ స్థానంలో డీకే అరుణనను నియమించాలని అమిత్‌షా, జేపీ నడ్డా స్ట్రాంగ్‌గా ఫిక్సయినట్లు తెలుస్తోంది. ఈమేరకు గురువారం ఆమెకు ఢిల్లీ నుంచి పిలుపు రావడంతో ఆమె హుటాహుటినా తరలివెళ్లారు. ఆమెకు ఢిల్లీలో తీపి కబురు అందే అవకాశం ఉందని తెలుస్తోంది. రాష్ట్రంలో పార్టీ విస్తరణకు చొరవ ఉన్న డీకే అరుణ అయితే బాగుంటుందని బీజేపీ హై కమాండ్ యోచిస్తోంది. అధ్యక్ష పదవీ కట్టబెట్టి.. పార్టీని క్షేత్రస్థాయి లో బలపరచాలని భావిస్తోంది.
ఇదిలా ఉండగా బుధవారం హైదరాబాద్‌లో బీజేపీ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మీడియాతో మాట్లాడుతూ కె.లక్ష్మణ్ సమర్థవంతంగా పనిచేయడం లేదని ఆరోపించారు. తనకు ఎమ్మెల్యేగా, ఓ నేతగా కూడా గౌరవం ఇవ్వడం లేదంటూ వాపోయారు. రాష్ట్రంలో అధ్యక్ష మార్పు తప్పదని ఆయన చెప్పకనే చెబుతూ అందుకు డీకే అరుణ, ఎంపీలు బండి సంజయ్, అరవింద్‌లు అర్హులని సూచించారు.
రాజాసింగ్ కామెంట్ చేసిన కొద్ది గంటల్లోనే డీకే అరుణకు ఢిల్లీ నుంచి కాల్ రావడం ఇప్పుడు పార్టీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.ఈ విషయం రాజాసింగ్‌కు ముందే తెలుసన్న చర్చ జరుగుతోంది. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఏమాత్రం ప్రొటోకాల్ పాటించడం లేదంటూ కూడా రాజాసింగ్ కామెంట్ చేసిన విషయాన్ని ఇప్పుడు ఆ పార్టీ శ్రేణులు గుర్తు చేస్తున్నారు.
డీకే అరుణ ఉమ్మడి ఆంధ్ర్రప్రదేశ్‌లో మంత్రిగా పనిచేశారు. తెలంగాణ రాజకీయాల్లో సుధీర్ఘకాలంగా కొనసాగుతూ వస్తున్నారు. ఇక ఆమెకు అధ్యక్ష పదవి అప్పగిస్తే కొత్తగా ఇతర పార్టీల నుంచి పెద్ద ఎత్తున చేరికలకు అవకాశం ఉంటుందని అమిత్‌షా, నడ్డా భావిస్తున్నారట. చూడాలి మరి డీకే అరుణకు ఢిల్లీలో ఎలాంటి సమాచారం అందుతుందో అన్నదానిపై రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది.