కేసీఆర్ రూట్‌లోనే రేవంత్ రెడ్డి…ఆ సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందా?

-

వాస్తుని చాలామంది ప్రజలు నమ్ముతారు. వాస్తు ప్రకారమే ఇల్లు, ఆఫీసులు, ఇతర కార్యాలయాలని నిర్మించుకుంటారు. అలాగే కట్టేసిన వాటిల్లో వాస్తు దోషాలు ఉంటే వాటిని సరిచేసుకుంటారు. ఇక ఈ వాస్తుని తెలంగాణ సీఎం కేసీఆర్ బాగా నమ్ముతారనే విషయం తెలిసిందే. ఆ వాస్తు ప్రకారమే పాత సచివాలయాన్ని కూల్చి, కొత్త సచివాలయ భవనాన్ని సకల హంగులతో, ఆధునిక పోకడలతో, ఆకర్షణీయంగా, సర్వాంగ సుందరంగా నిర్మించనున్నారు. సీఎం కేసీఆర్‌ ఆశించినట్లుగా పూర్తి వాస్తుతో సచివాలయ భవనం అందుబాటులోకి రానుంది.

ఇలా చాలా విషయాల్లో సీఎం కేసీఆర్ వాస్తుని నమ్ముతారు. అయితే కేసీఆర్ ఇలా వాస్తు పేరిట పలు శాఖల భవనాల్లో మార్పులు చేశారు. ఇక ఇలా పాత సచివాలయాన్ని కూల్చి కొత్తది కట్టడంపై తెలంగాణలోని ప్రతిపక్షాలు కేసీఆర్‌పై విమర్శలు చేశాయి. ఈ వాస్తు పిచ్చి వల్లా ప్రజల సొమ్ముని వృధా చేస్తున్నారని ఫైర్ అయ్యారు. అయితే కేసీఆర్ మాదిరిగానే కొత్తగా పీసీసీ అధ్యక్షుడైన రేవంత్ రెడ్డి ముందుకెళుతున్నట్లు కనిపిస్తోంది.

రేవంత్‌ రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకుంటున్న నేపథ్యంలో గాంధీభవన్‌లో వాస్తు మార్పులు చేపడుతున్నారు. ఇందులో భాగంగానే భవన్‌ ప్రవేశ మార్గాన్ని మారుస్తున్నారు. అలాగే తూర్పు, ఈశాన్యంలో ఎలాంటి బరువు ఉండకుండా చూస్తున్నారు. అంటే రేవంత్‌ బాధ్యతలు తీసుకున్న తరువాత పాత గేట్‌ నుంచి గాంధీ భవన్‌కు వచ్చి కొత్త గేట్‌ నుంచి వెళ్లిపోయేలా మార్పులు చేస్తున్నారు.

ఇలా రేవంత్ పీసీసీగా బాధ్యతలు తీసుకుంటున్న క్రమంలో గాంధీ భవన్‌లో వాస్తు పేరిట మార్పులు చేస్తున్నారు. అంటే రేవంత్ సైతం పదవి తీసుకున్నాక వాస్తు పేరిట మార్పులు చేయడం చూస్తే, భవిష్యత్‌లో ఇంకా మంచి పదవులు పొందాలనే ఉద్దేశంతో చేస్తున్నట్లు కనిపిస్తోంది. మరి చూడాలి ఈ వాస్తు సెంటిమెంట్ రేవంత్‌కు కూడా వర్కౌట్ అవుతుందేమో.

Read more RELATED
Recommended to you

Exit mobile version