ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం అక్రమంగా చట్టవ్యతిరేకంగా నిర్మిస్తున్న రాయలసీమ లిఫ్టు ఇరిగేషన్ స్కీం… సాగునీటి ప్రాజెక్టులలో నీటి ఎత్తిపోతలు., తెలంగాణలో జల విద్యుత్ ఉత్పత్తి…..తదితర అంశాలపై శనివారం నాడు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. నదీ జలాలమీద తన పొరుగు రాష్ట్రాలకు కేటాయించబడిన వాటాలను హక్కుగా వినియోగించుకోవడానికి తెలంగాణ రాష్ట్రం సంపూర్ణంగా సహకరిస్తుందని, అయితే కేటాయింపులు లేని నికరజలాలను దౌర్జన్యంగా వాడుకుంటామంటే తెలంగాణ ప్రజలు చూస్తూ ఊరుకోబోరని సీఎం కేసీఆర్ పునరుద్ఘాటించారు.
దశాబ్దాలపాటు తెలంగాణ సాగునీటికి గోస పడ్డదనీ, స్వయంపాలనలోనూ అటువంటి పరిస్థితిని ఎట్టి పరిస్థితిలో రానివ్వబోమన్నారు. బచావత్ ట్రిబ్యునల్ ఏర్పాటై 17 ఏండ్లు కావస్తున్నా, తెలంగాణకు కృష్ణా జలాల్లో నీటివాటాను నిర్ధారించకపోవడంపై సీఎం కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ నీటి వాటా కోసం అవసరమైతే కేంద్రంతో పోరాడుతామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఏపీ అక్రమంగా నిర్మిస్తున్న పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు ను గుర్తించడం లేదని పర్యావరణ అనుమతులు ఎన్జీటీ స్టే ఉన్నా నిర్మిస్తున్నారని మండిపడ్డారు. పోతిరెడ్డిపాడు కాలువకు నీటిని ఎత్తిపోతల రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కూడా అక్రమమే అని పేర్కొన్నారు.
జులై 9న నిర్వహించబోయే కృష్ణా బోర్డు త్రిసభ్య సమావేశం రద్దు చేయాలని… జూలై 20 తర్వాత పూర్తి స్థాయి బోర్డు సమావేశాన్ని ఏర్పాటు చేయాలని వెల్లడించారు సీఎం కేసీఆర్. అందులో తెలంగాణ రాష్ట్ర అంశాలు ఎజెండాగా చేర్చాలని… కృష్ణా బోర్డు సమావేశంలో మా వాదనలు వినిపిస్తామని స్పష్టం చేశారు. జూరాల శ్రీశైలం నాగార్జునసాగర్ పులిచింతల ప్రాజెక్టు లో నీటి లభ్యత ఉన్నంతకాలం విద్యుత్ ఉత్పత్తి జరుగుతుందన్నారు. విద్యుత్ ఉత్పత్తిని ఆపమని హక్కు కృష్ణా బోర్డు లేదు అని చెప్పిన సీఎం కేసీఆర్… జల విద్యుత్ కు సంబంధించిన రెండు రాష్ట్రాల మధ్య ఎలాంటి ఒప్పందాలు లేవని వెల్లడించారు.