పిసిసి చీఫ్ ఎంపికలో రేవంత్ రెడ్డి మాటనెగ్గుతుందా.. ఇంకా వీడని సస్పెన్స్..

-

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత.. రాష్ట్ర అధ్యక్ష పదవికి పోటీ పెరిగింది.. తనకు అనుకూలంగా ఉండే వారికి పదవి ఇప్పించుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారనే ప్రచారం జరుగుతుంది. అధిష్టానం మాత్రం దీనిపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో.. అందరిలోనూ ఉత్కంఠ కనిపిస్తోంది.. రేవంత్ రెడ్డి ద్వారా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కొందరి పేర్లను తీసుకున్నప్పటికీ దానిపైన ఇంకా స్పష్టత రాలేదు.. కాంగ్రెస్ పార్టీలో ఏ చిన్న పదవి అనౌన్స్మెంట్ అవ్వాలన్నా.. ఎన్నో పంచాయతీలు సమీకరణాలు తెరమీదకు వస్తాయి.. రాష్ట్ర అధ్యక్ష పదవి ప్రకటన ఆలస్యం పార్టీకే నష్టమని నేతలు అభిప్రాయపడుతున్నారు.

ప్రస్తుతం రాష్ట్ర అధ్యక్షుడుగా సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారు.. ఆ పదవిని కొత్తవారికి కట్టబెట్టాలని హస్తం అధిష్టానం భావిస్తోంది.. తన కోటరీలో ఉండే వ్యక్తులకు పదవి ఇప్పించేందుకు రేవంత్ రెడ్డి తన పలుకుబడిని ఉపయోగిస్తున్నారట. ఈ పదవి ఆలస్యం చేసే కొద్దీ పార్టీకి తీవ్ర నష్టం ఉంటుందని ఇప్పటికే రేవంత్ రెడ్డి అధిష్టానం దృష్టికి తీసుకెళ్లడంతో ఢిల్లీ పెద్దలు దీనిపై కసరత్తు కూడా ప్రారంభించారని పార్టీలో చర్చ నడుస్తోంది.

ముఖ్యంగా బీసీ ఎస్టీ ఎస్సీలకు సంబంధించిన నేతల ప్రొఫైల్స్ రేవంత్ రెడ్డి అధిష్టానం దృష్టిలో పెట్టారు.. బీసీ సామాజిక వర్గానికి చెందిన నేతలకు రాష్ట్ర అధ్యక్ష పదవి కేటాయిస్తే ఎలా ఉంటుందని చర్చ కాంగ్రెస్ పార్టీలో జరుగుతుంది. దీంతో ఆ సామాజిక వర్గానికి చెందిన మహేష్ గౌడ్, మధు యాష్కి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. అయితే ప్రభుత్వం వచ్చిన తరువాత మహేష్ గౌడ్ కు ఎమ్మెల్సీ పదవి రావడంతో మరో పదవి ఇవ్వద్దంటూ ఆయన వ్యతిరేక వర్గం అధిష్టానానికి ఫిర్యాదులు చేస్తుండట..

మధు యాష్కి మాత్రం అధ్యక్ష పదవి కోసం తీవ్ర స్థాయిలో లాబీయింగ్ చేస్తున్నారనే ప్రచారం జరుగుతుంది.. రాష్ట్ర అధ్యక్ష పదవి కోసమే తాను ఎంపీ సీటును వదులుకున్నానని .. కచ్చితంగా తనకే వస్తుందని అనుచరులు వద్ద యాష్కి చెబుతున్నారని తెలుస్తుంది. కానీ మధు యాష్కికి ఇస్తే మెజార్టీ నేతల్లో వ్యతిరేకత వచ్చే అవకాశం ఉందన్న విషయాన్ని రేవంత్ రెడ్డే అధిష్టానం దృష్టిలో పెట్టారని కామెంట్స్ వినిపిస్తున్నాయి.. మరో పక్క గిరిజన నేతగా ఉన్న ఎంపీ బలరాం నాయక్ పేరును కూడా అధిష్టానం పరిశీలిస్తుంది.. కేంద్ర మంత్రిగా పనిచేసిన అనుభవం ఉన్న నేపథ్యంలో రేవంత్ రెడ్డి కూడా ఆయన పేరును ప్రతిపాదించారట.. రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన పూర్తిచేసుకుని రాష్ట్రానికి వచ్చిన వెంటనే అధ్యక్ష పదవిని ప్రకటించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.. ఫైనల్ గా ఎవరికి అధ్యక్ష పదవి వరిస్తుందోనన్న సస్పెన్స్ ఇంకా కొద్దిరోజులు కొనసాగే అవకాశం ఉంది..

Read more RELATED
Recommended to you

Latest news