తెలంగాణ అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ కి మధ్య మాటల యుద్ధం కొనసాగింది. మొదట మంత్రులకు కేటీఆర్ కు మధ్య ఈ డైలాగ్ వార్ కొనసాగగా ఆ తర్వాత రేవంత్ రియాక్షన్ తో ఈ ఇద్దరి మధ్య మాటల యుద్ధం తీవ్ర స్థాయిలో సాగింది. కేటీఆర్ రెచ్చగొట్టేలా మాట్లాడటం మానుకోవాలంటూ సీఎం రేవంత్ ఆగ్రహంతో హెచ్చరించారు. పదేళ్లు రాష్ట్రాన్ని పాలించిన బీఆర్ఎస్ నేతలు.. పదినెలలు కూడా నిండని ప్రభుత్వంపై నిందలు వేస్తున్నారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. నాటి బీఆర్ఎస్ పాలన పైన ఆగ్రహం వ్యక్తం చేసారు.
కేటీఆర్‌కు ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్‌లకు పోలిక ఉందని.. కేటీఆర్ వంద పర్సెంట్ ఆర్టిఫీషియల్, సున్న పర్సెంట్ ఇంటిలిజెన్స్ అంటూ ఎద్దేవా చేశారు రేవంత్. ఇక ద్రవ్యవినిమయ బిల్లుపై వాడీ వేడీ చర్చ జరిగింది. దీనిపై అధికార, ప్రతిపక్ష నేతల మధ్య మాటలు తారాస్థాయికి చేరుకున్నాయి. డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క భవిష్యత్‌లో సీఎం కుర్చీలో కూర్చోవాలని మనసారా కోరుకుంటున్నట్టు కేటీఆర్ సెటైర్ పేల్చారు.
ఇక బతుకమ్మ చీరలపై అసెంబ్లీలో రగడ నడిచింది. ఆ చీరలను సిరిసిల్ల చేనేత కార్మికులు తయారు చేశారా? సూరత్ నుండి తెచ్చారా? అని సీఎం రేవంత్ ప్రశ్నించారు. గత ప్రభుత్వం బతుకమ్మ చీరల బకాయిలు పెడితే తాము విడుదల చేశామని చెప్పారు. ఎయిర్ పోర్టుకు ఎంఎంటీఎస్ సౌకర్యం కల్పిస్తామని కేంద్రం చేబితే వద్దని కేసీఆర్, కేటీఆర్ తిరస్కరించారన్నారు. రాష్ట్రంలోని కొన్ని స్టేడియంలు , ఆట స్థలాలు తాగుబోతులకు అడ్డాలుగా మారుతున్నాయన్నారు.
సికింద్రాబాద్, హైదారాబాద్, సైబరాబాద్‌లతో పాటు ముచ్చర్లలో నాలుగవ సిటీ ఏర్పాటు చేస్తామని తెలిపారు. పెట్టుబడులు ఎవరు పెట్టాలన్నా ముచ్చర్లకి రావాలని అన్నారు. పది సంవత్సరాల్లో తెచ్చిన ఒక్క పాలసీ ఏమైనా ఉందా? అంటూ కేటీఆర్‌ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను వ్యవసాయానికి అనుసంధానం చేసే ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు.మొదట మంత్రులకు కెటిఆర్‌కు మధ్య సాగిన యుద్ధం…సీఎం జోక్యంతో రేవంత్ వర్సెస్ కెటిఆర్‌లా మారింది. ఇరువురి మాటలతో అసెంబ్లీ రణరంగాన్ని తలపించింది.మొదట్లో ఒకరిపై ఒకరు సెటైర్లు పేల్చుకోగా చివరికి వాడివేడి దూషణలతో సభ అట్టుడికింది.
మాజీమంత్రి,ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి పార్టీ ఫిరాయింపు వ్యవహారం కూడా అసెంబ్లీలో హాట్ టాపిక్ గా మారింది.పార్టీ మారడాన్ని తప్పుపట్టిన కాంగ్రెస్ నేతలు విమర్శనాస్ర్తాలు సంధించారు. కాంగ్రెస్ పార్టీ తనను సీఎల్పీ లీడర్‌ను చేస్తే అండగా, మద్దుతుగా ఉండాల్సింది పోయి పదవి కోసం సబిత పార్టీ ఫిరాయించారంటూ భట్టి విక్రమార్క తప్పుబట్టారు.డిప్యూటీసీఎం తరువాత ఈ అంశంలోకి సీఎం ఎంటర్ అయ్యాక వాడివేడి విమర్శలు కొనసాగాయి.
మీ వెనకాల ఉన్న అక్కల మాటలు వింటే కేటీఆర్ జూబ్లీ బస్టాండ్‌లో కూర్చోవాల్సి వస్తది అంటూ సెటైర్ వేశారు.ఈ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మండిపడ్డారు. మహిళా ఎమ్మెల్యేలను కించపరిచారంటూ అభ్యంతరం వ్యక్తం చేస్తూ స్పీకర్ పోడియం వైపు దూసుకెళ్లారు. దీనిపై రేవంత్ రెడ్డి వివరణ ఇచ్చారు. కాంగ్రెస్‌ను, తనను మోసం చేసిన సబితక్కతో జాగ్రత్తగా ఉండాలని చెప్పడమే తన మాట్లలోని ఉద్దేశ్యమన్నారు.
తాను కాంగ్రెస్‌లోకి వస్తే ముఖ్యమంత్రివి అవుతావని సబితక్క తనతో చెప్పిందని, అలాగే మల్కాజ్ గిరి లోక్‌సభ నుంచి పోటీ చేయమని సూచించింది కూడా సబితక్కేనని రేవంత్ రెడ్డి గుర్తుచేశారు. ఇన్ని మాటలు మాట్లాడిన సబితక్క తమ్ముడిని మోసం చేసి బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్లిందని ఎద్దేవా చేశారు. దీనిపై సబితా ఇంద్రారెడ్డి ఎదురుదాడికి దిగారు. కేసీఆర్ ఇంటి మీద వాలిన కాకి తన ఇంటి మీద వాలితే కాల్చేస్తానని చెప్పిన రేవంత్ రెడ్డి.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఎలా చేర్చుకుంటున్నారని ప్రశ్నించారు. అక్కల మాట వింటే జూబ్లీ బస్టాండ్‌లో కూర్చోవాల్సి వస్తుందంటూ రేవంత్ రెడ్డి.. కేటీఆర్‌ను ఉద్దేశించి చెప్పడం పట్ల సబితా ఇంద్రారెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. కేటీఆర్‌ను తాము ఏం మోసం చేశామో చెప్పాలంటూ పట్టుబట్టారు. రేవంత్ రెడ్డి తన మాటలను వెనక్కి తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు.