తెలంగాణలో టీడీపీకి ఉన్నదే ఇద్దరు ముగ్గురు చోటా నాయకులు. వాళ్లు కూడా టీడీపీని వీడితే తెలంగాణలో టీడీపీ గతి ఏంటి? తెలంగాణలో టీడీపీ కనుమరుగు అవ్వడం తప్పితే మరో మార్గం లేదా?
సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ఓవైపు ఏపీలో, మరోవైపు తెలంగాణలో రాజకీయ వేడి రగులుకుంటోంది. రోజురోజుకూ తెలుగు రాష్ట్రాల రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఓవైపు ఏపీలో అధికార టీడీపీ పార్టీకి షాక్ లు ఇస్తూ టీడీపీ నాయకులంతా వైసీపీలో చేరుతున్న సంగతి తెలిసిందే. మరోవైపు తెలంగాణలోనూ అటూ ఇటూ కాకుండా ఉంది టీడీపీ పరిస్థితి. ఉన్న ఇద్దరు ముగ్గురు నేతలతో అలా కాలం వెళ్లదీస్తున్న ఈ తరుణంలో టీడీపీ పొలిట్ బ్యురో సభ్యుడు నామా నాగేశ్వరరావు టీఆర్ఎస్ లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు.
తాజాగా ఆయన టీడీపీకి రాజీనామా చేశారు. ఇటీవల తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఖమ్మం అసెంబ్లీ స్థానానికి మహా కూటమి తరుపున నామా బరిలోకి దిగారు. అయితే ఆయన ఘోరంగా ఓడిపోయిన సంగతి తెలిసిందే. దీంతో అప్పటి నుంచి ఆయన టీడీపీతో అంటి ముట్టనట్టుగానే ఉంటున్నారు. దీంతో ఆయన టీడీపీకి గుడ్ బై చెప్తారనే ఊహాగానాలు వినిపించాయి. అయితే.. ఆయన కాంగ్రెస్ లో చేరి.. ఖమ్మం ఎంపీ అభ్యర్థిగా నిలబడతారని వార్తలు వచ్చినా.. ఆయన టీఆర్ఎస్ లో చేరడానికి సుముఖంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఈనేపథ్యంలో ఆయన సోమవారం ముఖ్యమంత్రి కేసీఆర్ తో భేటీ అయినట్లు సమాచారం. ఆయన్ను ఖమ్మం లేదా మల్కాజ్ గిరి నుంచి టీఆర్ఎస్ తరుపున ఎంపీగా బరిలోకి దింపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సీఎం కేసీఆర్ కూడా ఆయనకు హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.
నామా నాగేశ్వరరావు 2009లో టీడీపీ తరుపున ఖమ్మం ఎంపీగా గెలిచారు. 2014 లో ఓడిపోయారు. దీంతో మరోసారి ఖమ్మం ఎంపీగా టీఆర్ఎస్ నుంచి బరిలో దిగడానికి నామా సన్నాహాలు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇవాళో రేపో ఆయన టీఆర్ఎస్ లో చేరే అవకాశాలు ఉన్నట్టు సమాచారం.