అమరావతి: విశాఖలో భూరికార్డుల ట్యాంపరింగ్‌పై విచారణ జరిపిన సిట్ కేబినెట్‌కు నివేదిక అందజేసింది. ఆ నివేదికలో మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు పేరు ఉంది. ఈయన గత కాంగ్రెస్ ప్రభుత్వంలో రెవెన్యూ శాఖ మంత్రిగా పని చేశారు. గత 15 ఏళ్లుగా జరిగిన భూ లావాదేవీలపై సిట్ విచారణ జరిపింది. ధర్మాన కుమారుడి పేరుమీద ఉన్న భూములపైనా ఆరోపణలు ఉన్నాయి. విచారణ జరిపిన సిట్ ఇచ్చిన నివేదికలో ముగ్గురు కలెక్టర్లు, నలుగురు జాయింట్ కలెక్టర్ల పేర్లు ఉన్నాయి. 10 మంది డీఆర్వోలు, 14 మంది ఆర్డీవోల పేర్లు ఉన్నాయి. మొత్తంగా 100 మంది అధికారులపై క్రిమినల్, శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని సిట్ తన నివేదికలో సూచించింది.
విశాఖలో వందల కోట్ల విలువైన భూములను రికార్డుల ట్యాంపరింగ్ ద్వారా బడా నేతలు దక్కించుకున్నారు. బినామీ పేర్లతో ఎకరాలకు ఎకరాలు రికార్డుల్లో ఎక్కించి అమ్మి సొమ్ము చేసుకున్నారు. ఈ స్కాంలో ఐఏఎస్, గ్రేడ్-1 స్థాయి అధికారుల ప్రమేయం ఉందని కూడా సిట్ నివేదికలో వెల్లడించింది. ఇందులో కొందరు అధికారులను సస్పెండ్ చేయాల్సిన అవసరం ఉందని సిఫారసు చేసింది. అలాగే కొన్ని భూముల రిజిస్ట్రేషన్ రద్దు చేయాలని సూచించింది. సిట్ నివేదికపై తదుపరి చర్యలకు కేబినెట్ కమిటీని ఏర్పాటు చేసింది.
ఈ భూకుంభకోణంలో గత ప్రభుత్వాల భాగోతం బయటపడింది. అధికారాన్ని అడ్డం పెట్టుకుని మాజీ సైనికుల భూముల కొట్టేసిన బడా బాబులకు షాక్ తగిలింది. అప్పటి ఎన్ఓసీల రద్దుకు కేబినెట్ రంగం సిద్ధం చేస్తోంది. భూకుంభకోణంలో మంత్రి గంటా శ్రీనివాసరావుకు సంబంధం లేదని సిట్ తేల్చింది. కొందరు టీడీపీ నేతలు తక్కువ ధరకు కొన్న దొంగ భూములు.. అసలు యజమానుల పరమయ్యే అవకాశం ఉంది. సీట్ నివేదికతో కిందిస్థాయి రెవెన్యూ సిబ్బంది పీకల దాకా మునిగింది. విశాఖ భూ కుంభకోణం వెనుక మంత్రి గంటా హస్తం ఉందని టిడిపి నాయకుడు, మంత్రి అయ్యన్న పాత్రుడు ఆరోపించి సంచలనం సృష్టించిన విషయం విధితమే.