డీఎంకే అధినేత, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి(94) గత కొంత సేపటి క్రితమే కన్నుమూశారు. వయోభారం, అనారోగ్య సమస్యలతో గత కొన్ని రోజులుగా చెన్నైలోని కావేరి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కరుణానిధి ఈరోజు సాయంత్రం 6.10గంటలకు తుదిశ్వాస విడిచినట్లు ఆసుపత్రి వైద్యులు ప్రకటించారు. కాగా కరుణానిధి మృతి వార్త తెలుసుకున్న ఆయన అభిమానులు, డీఎంకే శ్రేణులు ఆసుపత్రి వద్దకు భారీగా తరలివచ్చారు.
కరుణానిధి మరణం నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా చెన్నై నగరంలో భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. గోపాలపురంలోని కరుణానిధి నివాసానికి ఆయన కుటుంబ సభ్యులు, బంధువులు చేరుకున్నారు. కాగా ముత్తువేల్ కరుణానిధి అసలు పేరు దక్షిణామూర్తి. కరుణానిధికి ముగ్గురు భార్యలు పద్మావతి, దయాళు అమ్మాళ్, రాజత్తి అమ్మాళ్. వైద్య లాంఛనాలు పూర్తి చేసిన అనంతరం కరుణానిధి భౌతికకాయాన్ని గోపాలపురంలోని ఆయన నివాసానికి తరలిస్తారు. అక్కడ కొన్ని క్రతువులు పూర్తి చేసిన తర్వాత ప్రజల సందర్శనార్థం చెన్నైలోని రాజాజీ హాలుకు తరలించే అవకాశముంది.
కరుణానిధి మరణంతో ఆయన కుటుంబ సభ్యులు, డీఎంకే కార్యకర్తలు, అభిమానులు విషాదంలో మునిగిపోయారు. 5 సార్లు తమిళనాడు సీఎంగా చేశారు కరుణానిధి. చివరిసారిగా 2006లో కరుణానిధి సీఎం అయ్యారు. అన్నాదురై మరణం తర్వాత 1969 జులై-27న డీఎంకే అధ్యక్షుడిగా కరుణానిధి భాధ్యతలు చేపట్టారు. కరుణానిధికి ఎన్నికల్లో ఓటమి అంటే తెలియదు. జూన్-3,1923న తమిళనాడులోని నాగపట్టినం జిల్లాలోని తిరుక్కువలై గ్రామంలో జన్మించారు.