జగన్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే విధానాల్లో ప్రధానంగా ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు అనుసరిస్తున్న వైఖరి బూమరాంగ్ మాదిరిగా ఎదురు తిరుగుతోంది. ఆయన ఏ విమర్శ చేసినా వెంటనే అది ఆయనకే చుట్టుకుంటోంది. ఇప్పటి వరకు రాజధాని అమరావతి విషయంపై పెద్ద ఎత్తున విమర్వలు చేసిన చంద్రబాబుకు వైసీపీ నుంచి ఎలాంటి ప్రతి విమర్శా ఎదురు కాలేదు. అయితే, దీనికి భిన్నంగా ఇతర పక్షాల నుంచి, సోషల్ మీడియా నుంచి తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి.
పైగా టీడీపీలోని కీలక నాయకులు, అమరావతిలో భూములు కొనుగోలు చేసిన మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు మౌనం వహించారు. ఇక, ఇప్పుడు అది అయిపోవడంతో తాజాగా బియ్యం విషయాన్ని తలకెత్తుకున్నారు. జగన్ ప్రభుత్వం ప్రతి ష్టాత్మకంగా రాష్ట్రంలో ఈ నెల 1 నుంచి శ్రీకాకుళంలో నాణ్యమైన బియ్యం పంపిణీకి శ్రీకారం చుట్టింది. ఈ కార్యక్రమాన్ని నాలుగు రోజులు ఆలస్యమైనా.. స్వయంగా సీఎం జగనే శ్రీకాకుళం జిల్లా పలాస నియోజక వ ర్గంలో ప్రారంభించారు.
అయితే, ఇలా పంపిణీ చేసిన బియ్యంలో అలా ముక్కవాసన వచ్చిందని, బియ్యం పాడై పోయి ఉన్నాయని పెద్ద ఎత్తున ఫొటోలతో సహా టీడీపీ ప్రధాన కార్యదర్శి లోకేష్ వివాదానికి రెడీ అ య్యారు. నిజానికి జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలోనే ఉభయ గోదావరి జిల్లా రైస్ మిల్లర్ల నుంచి సేకరించిన బియ్యాన్ని అందులోనూ నాణ్యమైన బియ్యాన్నే ప్రత్యేకంగా ప్యాకింగ్ చేయించి ప్రజలకు పంపిణీ చేయాలని నిర్ణయించారు. ఈ క్రమంలో ఎక్కడా తప్పు జరిగే అవకాశం ఎంత మాత్రం లేదు. పైగా కనీసం ఆరు మాసాలు ఉంటేనే తప్ప.. ప్రస్తుతం వీరు చూపిస్తున్న ఫొటోల్లో ఉండేలా .. బియ్యం గడ్డలు కట్టడం, ముక్కవాసన రావడం వంటివి జరిగే ఛాన్స్ లేదు.
ఈ విషయం టీడీపీ పెద్దలకు తెలియంది కాదు. అయినా కూడా ఏదో ఒక మిషతో జగన్ ప్రబుత్వాన్ని అభాసు పాలు చేయడంలో భాగంగానే ఒకటి రెండు బియ్యం బస్తాలను చూపించి ఇలా యాగీ చేయడం చంద్రబాబు సీనియార్టీనే ప్రశ్నార్థకం చేస్తోంది. ప్రతి విషయాన్నీ విమర్శించాలని భావించడం కూడా బాబుకు వ్యతిరేకతనే తెచ్చిపెడుతుందనే విషయాన్ని ఆయన ఎప్పుడు గమనిస్తారో చూడాలి.