తెలంగాణలో రెండోసారి మంత్రి వర్గ విస్తరణకు ముహూర్తం కుదిరింది. ఆరు మంత్రు పదవులను భర్తీ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న క్యాడర్, రాష్ట్ర ప్రజలకు ఎట్టకేలకు మంత్రి వర్గ విస్తరణ విషయం తేలిపోయింది. ఆదివారం సాయంత్రం 4 గంటలకు కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో మంత్రులకు శాఖల కేటాయింపుపై టీఆర్‌ఎస్ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. గంగుల కమలాకర్, పువ్వాడ అజయ్‌కుమార్, సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్ పేర్లను సీఎంవో నుంచి రాజ్‌భవన్‌కు పంపించారు.
అయితే క్యాబినెట్ కూర్పుపై సీఎం కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ప్రగతి భవన్‌లో శాఖల కేటాయింపుపై సీఎం కేసీఆర్ కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది. కేటీఆర్, హరీశ్, గుత్తా, వినోద్‌తో కేసీఆర్ సమావేశమయ్యారు. ప్రస్తుతం ఉన్న మంత్రుల శాఖలను మార్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. మహమూద్ అలీని హోంశాఖ నుంచి మైనార్టీ సంక్షేమానికి, జగదీష్‌రెడ్డిని విద్యాశాఖ నుంచి విద్యుత్ శాఖకు మార్చే అవకాశం ఉన్నట్లు తెలిసింది.
గుత్తాకు మంత్రివర్గంలో స్థానం ఇస్తారని అనుకున్నా సమీకరణాల వల్ల ఆయనకు మండలి చైర్మన్ పదవీ ఇచ్చే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ఈటల రాజేందర్ శాఖ మార్పునకు కేసీఆర్ సుముఖంగా ఉన్నట్లు సమాచారం. ఈటలను ఆరోగ్యశాఖ నుంచి విద్యాశాఖకు మార్చే అవకాశం ఉన్నట్లు భోగట్టా. కేటీఆర్‌కు ఐటీ, మున్సిపల్ శాఖ, హరీశ్‌రావుకు ఆర్థికశాఖ లేదా ఇరిగేషన్ శాఖ ఇచ్చే అవకాశం ఉన్నట్లు ప్రభుత్వ వర్గాల సమాచారం. సబితకు హోంశాఖ కేటాయించే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది. అదేగానీ జరిగితే.. టీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో హోం శాఖ బాధ్యతలు నిర్వర్తించిన తొలి మహిళా మంత్రిగా, తెలంగాణ తొలి మహిళా హోం మంత్రిగా సబితా నిలిచిపోనున్నారు. పువ్వాడ అజయ్‌కు వైద్య, ఆరోగ్యశాఖ ఇచ్చే అవకాశం, సత్యవతి రాథోడ్‌కు స్త్రీశిశు, గిరిజన సంక్షేమ శాఖలు కేటాయించే అవకాశం ఉన్నట్లు తెలిసింది.
ఏది ఏమైనా కొన్ని రోజులుగా ప్రతిపక్షాలు రాజకీయ వేడిని పుట్టిస్తున్న సందర్భంలో కొత్త గవర్నర్ రాక, మంత్రిమండలి విస్తరణ, ట్రబుల్ షూటర్స్ మంత్రివర్గంలో చేరడం వంటి పలు అంశాలతో రాష్ట్ర రాజకీయం రసవత్తరంగా మారనున్నది. అంతేకాదు పలు కీలక నిర్ణయాలను ఈరోజు జరిగే క్యాబినెట్ భేటిలో తీసుకోనున్నట్లు సమాచారం. పుకార్లు షికార్ల మధ్య కొన్ని గంటల్లో అసలైన విషయాలు తెలియనున్నాయి.