విక్రమ్‌ ల్యాండర్‌ను గుర్తించిన ఇస్రో!

-

చంద్రయాన్‌-2లో విక్రమ్‌ చంద్రుడికి 2.1 కి.మీ దూరంలో మాయమైన విషయం అందరికీ విదితమే. అయితే ఈ విషయంలో ఇస్రో సైంటిస్టులు పురోగతి సాధించారు. దీనికి సంబంధించి ఇస్రో చైర్మన్‌ కె.శివన్‌ ఓ ప్రకటన విడుదల చేశారు. విక్రమ్‌ ల్యాండర్‌ ఎక్కడ ఉందో కనుగొన్నామని ఆయన అన్నారు. దీనికి సంబంధించిన ఫొటోలను సేకరించామన్నారు. అయితే దానితో ఎలాంటి కమ్యునికేషన్స్‌ లేవన్నారు. విక్రమ్‌తో కాంటాక్ట్‌ కావడానికి ప్రయత్నిస్తున్నామని ఆయన తెలిపారు. త్వరలోనే ఆ దిశగా విజయం సాధిస్తామని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

సెప్టెంబర్‌ 7నాటి తుది దశ ప్రయోగంలో విక్రమ్‌ ల్యాండర్‌తో కమ్యునికేషన్స్‌ కోల్పోయిన విషయం తెలిసిందే. 95శాతం విజయం సాధించామని.. చివరి నిమిషంలో విక్రమ్‌తో సంబంధాలు తెగిపోయాయని ఇస్రో చైర్మన్‌ శివన్‌ తెలిపారు. దేశమంతా ఉత్కంఠతో ఎదురు చూసిన క్షణాలు.. ఫలితం తేలకకుండానే ముగిసిపోవడం శాస్త్రవేత్తలను తీవ్ర నిరాశకు గురి చేసింది. అయితే తాజా ప్రకటనతో అందరిలో మళ్లీ ఆశలు చిగురించాయి. అయితే విక్రమ్‌ చంద్రుడి మీద ఏ విధంగా ఉందో అనేదాని మీద తాజా పరిస్థితి ఉంటుంది. విక్రమ్‌కు ఉన్న యాంటీనా డైరెక్షన్‌, స్పందించే అంశాలపై విక్రమ్‌ పనితీరు ఆధారపడి ఉంటుంది. దీనికి సంబంధించి సిగ్నల్‌ వ్యవస్థ పునరుద్ధరణ కోసం ఇస్రో శాస్త్రవేత్తలు తీవ్రంగా కృషి చేస్తున్నారు.

విక్రమ్‌ ల్యాండర్‌ లొకేషన్‌ను గుర్తించడంతో అందరిలో ఆశలు చిగురించాయి. రెండోమూడు రోజుల్లో సిగ్నల్‌ వ్యవస్థను పునరుద్ధరించే అవకాశం ఉందని ఇస్రో సైంటిస్టులు ఆశాభావాన్ని వ్యక్త చేస్తున్నారు. విక్రమ్‌ ల్యాండర్‌ ఫొటోలను ఆర్బిటార్‌ పంపింది. టెలీకమాండ్‌ ద్వారా కమ్యూనికేషన్‌ వ్యవస్థను పునరుద్ధరించడానికి రకరకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఇదంతా యాంటీనా పడిన యాంగిల్‌ను బట్టి ఉంటుంది. ఏది ఏమైనా మన శాస్త్రవేత్తలు తప్పక ప్రజ్ఞతో తిరిగి కమ్యూనికేషన్‌ చేస్తారని ఆశిద్దాం.

Read more RELATED
Recommended to you

Latest news