ఆ ఎస్పీ, ఐఏఎస్ నాపై కుట్ర చేశారు.. ర‌ఘురామ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు

ఎంపీ ర‌ఘురామ కృష్ణం రాజు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఏపీ ప్ర‌భుత్వంలోని కీల‌క నేత‌ల‌పైనే ఆయ‌న ఆరోప‌ణ‌లు చేస్తూ వ‌చ్చారు. కానీ ఈ రోజు కేంద్ర‌మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ను ఆయ‌న క‌లిసి కీల‌క ఫిర్యాదు చేశారు. త‌న‌ను జ‌గ‌న్ ప్ర‌భుత్వం క‌క్ష్య‌సాధింపు చ‌ర్య‌ల‌కు దిగుతోంద‌ని, అలాగే ముగ్గురు అధికారులు వేధిస్తున్నారంటూ సంచ‌ల‌న ఫిర్యాదు చేశారు.

తనను ఆర్మీ ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేసి వెంటనే ఏపీ సీఐడీకి అప్పగించాలని ముగ్గురు అధికారులు కుట్ర పన్నారని ర‌ఘురామ తెలిపారు. ఈ మేరకు ఆయన కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కి మూడు పేజీల ఫిర్యాదు అందజేశారు.

ఆర్మీ ఆస్పత్రి రిజిస్ట్రార్ కేపీ రెడ్డి తనను ఆ ఆస్ప‌త్రి నుంచి త్వరగా డిశ్చార్జి చేయాలని వైద్యులపై ఒత్తిడి తెచ్చారని రఘురామ ఆరోపించారు. కేపీ రెడ్డితో పాటు గుంటూరు అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డి, టీటీడీ ఏఈవో ధర్మారెడ్డి తనను ఏపీ సీఐడీకి అప్పగించేందుకు కుట్రపన్నారని వెల్ల‌డించారు. డిశ్చార్జి చేసిన వెంటనే అదుపులోకి తీసుకునేందుకు మఫ్టీలో పోలీసులను పెట్టారని చెప్పారు. వారిపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఫిర్యాదులో కోరారు.