మునుగోడు ఉపఎన్నికే కాదు..2018 సాధారణ ఎన్నికల నుంచి టీఆర్ఎస్ పార్టీకి కొన్ని గుర్తులు పెద్ద శాపంగా మారాయి. టిఆర్‌ఎస్ పార్టీ కారు అనే సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఆ గుర్తుని పోలిన గుర్తులు కొన్ని ఉన్నాయి…ట్రాక్టర్, ఆటో, రోడ్ రోలర్, సబ్బు పెట్టే, చపాతీ రోలర్, చెప్పులు జోడు…ఇలా పలు గుర్తులు ఆకారంలో కారుకు దగ్గరగా ఉంటాయి. అయితే టిఆర్‌ఎస్ పార్టీ గుర్తు అయిన కారుకు వేద్దామని కొందరు పొరపాటున..ఆ కారు గుర్తుని పోలిన వాటికి వేస్తున్నారు. దీని వల్ల టిఆర్‌ఎస్ పార్టీకి నష్టం జరుగుతుంది.
దుబ్బాకలో టిఆర్‌ఎస్ స్వల్ప మెజారిటీ 1700 ఓట్లతో ఓడిపోయింది…అక్కడ కారుని పోలిన గుర్తులకు ఐదు వేలు పైనే పడ్డాయి. అంటే టిఆర్‌ఎస్‌కు నష్టం జరిగింది. ముసలి వాళ్ళు, కళ్ళు కాస్త మసక మసకగా కనిపించేవారు..కారు బదులు..వేరే గుర్తుకు ఓటు వేసేస్తున్నారు. అందుకే మునుగోడు ఉపఎన్నికలో కారు గుర్తుని పోలిన గుర్తులని తొలగించాలని టిఆర్‌ఎస్ గట్టిగానే పోరాటం చేసింది. ఈ క్రమంలోనే కొన్ని గుర్తులని ఎన్నికల సంఘం ఇండిపెండెంట్ అభ్యర్ధులకు కేటాయించలేదు.
కానీ చపాతీ రోలర్, రోడ్ రోలర్, చెప్పులు జోడు గుర్తులని ఇండిపెండేట్ అభ్యర్ధులకు కేటాయించింది. ముఖ్యంగా చపాతీ రోలర్ గుర్తు..టిఆర్‌ఎస్ కారు గుర్తు ఉన్న ఈవీఎంలోనే ఉంది. దీంతో కొందరు కన్ఫ్యూజ్ అయ్యి..ఆ గుర్తుకు ఓటు వేసినట్లు ఉన్నారు. అందుకే చపాతీ రోలర్ గుర్తుతో పోటీ చేసిన శ్రీశైలం యాదవ్‌కు 2407 ఓట్లు వచ్చాయి. నాలుగో స్థానంలో ఉన్న బిఎస్‌పికి 4145 ఓట్లు పడగా, ఆ తర్వాత స్థానంలో ఇండిపెండెంట్ అభ్యర్ధి ఉన్నారు.
ఇక రోడ్ రోలర్ గుర్తుకు 1874 ఓట్లు, చెప్పులు జోడు గుర్తుకు 2270 ఓట్లు వచ్చాయి. మొత్తం మీద ఓ 6 వేల పైనే ఓట్లు…కారు గుర్తుని పోలిన గుర్తులకు పడ్డాయి. దీని వల్లే తమ మెజారిటీ తగ్గిందని, లేదంటే ఎక్కువ మెజారిటీతో గెలిచేవాళ్లమని కేటిఆర్ అన్నారు. ఒకవేళ మెజారిటీ ఇంకా టఫ్ ఫైట్ నడిచి ఉంటే ఈ గుర్తుల వల్ల టిఆర్‌ఎస్‌కు డ్యామేజ్ జరిగేది. మరి భవిష్యత్‌లో కారు గుర్తుని పోలిన గుర్తులని తొలగించడానికి టిఆర్‌ఎస్ ఎలా కష్టపడుతుందో చూడాలి.