సీఎం చంద్రబాబు గతంలో హోదా వద్దని, ప్యాకేజీ తీసుకున్నారని, కానీ ఇప్పుడు హోదా కావాలని అడుగుతున్నారని, ఇలాంటి యూటర్న్‌లు తీసుకునే నాయకుడు ముఖ్యమంత్రిగా ఎలా ఉంటాడని మోడీ అన్నారు.
ఎన్నికలు సమీపిస్తున్నకొద్దీ ఏపీలో రాజకీయం క్రమంగా వేడెక్కుతోంది. ప్రత్యర్థి పార్టీల నాయకులే లక్ష్యంగా ఇతర పార్టీలకు చెందిన నాయకులు ఘాటైన విమర్శలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు తమ మాటలకు పదును పెంచారు. అలాగే ప్రతిపక్ష పార్టీ నేత జగన్ కూడా సమయం దొరికినప్పుడల్లా టీడీపీని విమర్శిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే ఏపీ పర్యటనలో భాగంగా వైజాగ్‌లో నిర్వహించిన బహిరంగ సభలో మోడీ టీడీపీపై ఎదురు దాడి చేశారు. చంద్రబాబుపై మాటల తూటాలతో విరుచుకు పడ్డారు.
వైజాగ్ సభలో ప్రధాని మోడీ మాట్లాడుతూ.. ఏపీలో చంద్రబాబు కుటుంబ పాలనే కొనసాగుతుందని విమర్శించారు. టీడీపీ గ్యాంగ్ అవినీతి పాలన చేస్తుందని దుయ్యబట్టారు. సీఎం చంద్రబాబు గతంలో హోదా వద్దని, ప్యాకేజీ తీసుకున్నారని, కానీ ఇప్పుడు హోదా కావాలని అడుగుతున్నారని, ఇలాంటి యూటర్న్‌లు తీసుకునే నాయకుడు ముఖ్యమంత్రిగా ఎలా ఉంటాడని మోడీ అన్నారు. సీఎంగా చంద్రబాబు ఉండడం ఏపీ దురదృష్టమని వ్యాఖ్యానించారు. ఏపీ ప్రజల ఉనికిని, గౌరవాన్ని చంద్రబాబు తాకట్టు పెట్టారని, కాంగ్రెస్‌తో కలసి బాబు జత కట్టారని మోడీ అన్నారు.
తనను గద్దె దించేందుకు ఎన్డీఏ కూటమికి వ్యతిరేకంగా మాయా కూటమితో బాబు జట్టు కట్టారని మోడీ అన్నారు. ముందు చంద్రబాబు తన సీఎం కుర్చీ ఉంటుందో, ఊడుతుందో చూసుకోవాలని మోడీ అన్నారు. కాగా మోడీ చేసిన ఈ వ్యాఖ్యలపై స్పందించిన చంద్రబాబు మాట్లాడుతూ…మోడీ ఏపీకి తనను తిట్టేందుకే వచ్చారని, తాను ఒక వేళ మోడీకి కనిపిస్తే కొడతారు కాబోలునని చంద్రబాబు ఎద్దేవా చేశారు. రాష్ట్రానికి అన్యాయం చేసి ఏ ముఖం పెట్టుకుని ఇక్కడికి మోడీ వచ్చారని బాబు ప్రశ్నించారు. కాగా మోడీ చంద్రబాబుపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి.