చదువులు చెప్పే పాఠశాలకు అద్దె కష్టాలు ఉండటమేంటి..? అద్దె చెల్లించలేక టీచర్లే ఈ పాఠశాలను వేరే పాఠశాలలో విలీనం చేయండంటూ అభ్యర్థించడం ఏంటి..? అంటూ చిలకలూరిపేట శాసనసభ్యురాలు విడదల రజిని ఆవేదన వ్యక్తంచేశారు. మండల కేంద్రం యడ్లపాడులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అద్దె భవనాల్లో నడుస్తోందని, వసతులు లేవని గ్రామస్తులు, ఉపాధ్యాయులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా.. బుధవారం విడదల రజిని తాను స్వయంగా పాఠశాలకు వెళ్లి పరిశీలించారు. ఈ సందర్భంగా స్కూల్ హెచ్ఎం గొట్టిపాటి శివపార్వతి మాట్లాడుతూ ప్రైవేటు భవనాల్లో ప్రభుత్వ పాఠశాల నడుస్తోందని, వారికి తామే అద్దె కట్టాల్సి వస్తోందని, ఏడాదిపాటు తమ జీతాల నుంచే అద్దె చెల్లించామని, ఇక తమ వల్ల కాదని, దయచేసి ఈ పాఠశాలను మరో పాఠశాలలో విలీనం చేసేందుకు చొరవచూపాలని విన్నవించుకున్నారు. వీరి దుస్థితి విన్న ఎమ్మెల్యే చలించిపోయారు. 300 మందికిపైగా పిల్లలు ఉన్న పాఠశాలను వేరే పాఠశాలలో విలీనం చేయడం ఏంటంటూ ప్రశ్నించారు. మరేం పర్లేదని, ఎంత ఖర్చయినా తాను భరిస్తానని భరోసా ఇచ్చారు. ఇకపై నెలనెలా అద్దె తానే కడతానని, సంతోషంగా పాఠశాలను ఇక్కడే కొనసాగించండని అభయమించారు. త్వరలోనే భూములు అందుబాటులో ఎక్కడ ఉన్నాయో చూసి, అక్కడే ప్రభుత్వ ఆర్థిక సాయంతో శాశ్వత భవనాల నిర్మాణం పూర్తయ్యేలా చూస్తానని హామీ ఇచ్చారు.