ఏపీలో వైసీపీ ప్రకటించిన 9వ జాబితాలో అనూహ్యంగా విజయసాయిరెడ్డికి చోటు లబించింది. అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో అధికార పార్టీ వైఎస్సార్ సీపీ శుక్రవారం రాత్రి 9వ జాబితా విడుదల చేసింది. ఈ జాబితాలో మూడు స్థానాలకు మాత్రమే ఇన్‌ఛార్జిలను నియమిస్తూ లిస్ట్‌ను రిలీజ్ చేశారు. నెల్లూరు ఎంపీ స్థానానికి ఇంఛార్జ్‌గా, రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయిరెడ్డిని నియమించారు.
కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా రిటైర్డ్ ఐఏఎస్ ఎండీ ఇంతియాజ్ అహ్మద్ , మంగళగిరి నియోజకవర్గ సమన్వయకర్తగా మురుగుడు లావణ్యని నియమిస్తూ వైసీపీ ఓ ప్రకటన విడుదల చేసింది. గతంలో గంజి చిరంజీవిని మంగళగిరికి సమన్వయకర్తగా నియమించింది.తాజాగా ఆయనను తప్పిస్తూ, మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల కూతురు లావణ్యకు అవకాశం ఇచ్చారు.ఎన్నికలకు సిద్దంగా ఉండాలని నూతన సమన్వయకర్తలకు సీఎం జగన్ సూచించారు.
వైసీపీ ఇంఛార్జ్‌ల తొలి జాబితాలో 11 అసెంబ్లీ స్థానాలకు కొత్త ఇంఛార్జిలను జగన్ ప్రకటించారు. రెండో జాబితాలో మరో 27 స్థానాలకు (మూడు ఎంపీ, 24 అసెంబ్లీ), మూడో జాబితాలో 21 స్థానాలకు (ఆరు ఎంపీ, 15 అసెంబ్లీ), నాలుగో లిస్టులో ఎనిమిది స్థానాలకు (ఒక ఎంపీ, ఎనిమిది అసెంబ్లీ) ఇంఛార్జీలను ప్రకటించారు. ఐదో జాబితాలో ఏడు స్థానాలకు (3 అసెంబ్లీ, 4 ఎంపీ) కొత్త ఇంఛార్జిలను నియమించారు. 6వ జాబితాలో నాలుగు పార్లమెంట్, ఆరు అసెంబ్లీ స్థానాలకు ఇంఛార్జిలను ప్రకటిస్తూ వైసీపీ జాబితా విడుదల చేసింది. 7వ జాబితాలో 2 అసెంబ్లీ నియోజకవర్గాలకు సమన్వయకర్తలను ప్రకటించారు. 8వ జాబితాలో 2 పార్లమెంట్, 3 అసెంబ్లీ స్థానాలకు ఇంఛార్జ్‌లను వైఎస్ జగన్ నియమించారు. తాజాగా రెండు అసెంబ్లీ, ఒక పార్లమెంట్ స్థానానికి వైసీపీ సమన్వయ కర్తల్ని ప్రకటించారు.చివరగా మరో లిస్ట్ ఇచ్చేందుకు వైసీపీ అధిష్టానం కసరత్తు చేస్తోంది.
ఏ పార్టీతో పొత్తు పెట్టుకోకుండా ఈసారి కూడా వైసీపీ ఒంటరిగానే సార్వత్రిక ఎన్నికల బరిలో దిగుతోంది. జనసేనతో పొత్తు పెట్టుకున్న తెలుగుదేశం పార్టీ కూటమిగా ఎన్నికలకు సిద్దమైంది. ఇప్పటికే ఆ కూటమి తొలి జాబితాలో కొన్ని నియోజకవర్గాలకు అభ్యర్దులను ప్రకటించిన విషయం తెలిసిందే.ఇక కాంగ్రెస్ పార్టీ ఉభయ కమ్యూనిస్టులను కలుపుకుని మమరో కూటమిగా ఏర్పడి ఎన్నికలకు వెళ్ళనుంది. ఈ కూటమిలో మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ స్థాపించిన పార్టీ కూడా కలవనున్నట్లు సమాచారం.
ఈ రెండు కూటమములతో ఒంటరిగా వైసీపీ ఎన్నికల బరిలోకి దిగుతోంది. టీడీపీ కూటమికి కేంద్రంలోని భారతీయ జనతాపార్టీతో పొత్తు అంశం లేనట్టేనని విశ్వసనీయ వర్గాల నుంచి వచ్చిన సమాచారం.దీంతో రెండ జాబితాను ప్రకటించిన టీడీపీ-జనసేన కూటమి సిద్దమవుతోంది. ఈ నెల 10వ తేదీన ఎన్నికల నోటిఫికేషన్ రానున్న నేపథ్యంలో ఈలోపు అభ్యర్దులను పూర్తిస్థాయిలో ఖరారు చేసేందుకు కూటమిలోని అగ్రనేతలు కసరత్తు చేస్తున్నారు.