ఉత్కంఠ వీడి ఉల్లాసభరిత వాతావరణం ఒకటి వచ్చింది.ఉద్యోగుల విషయమై ప్రభుత్వం మరోమారు తన నిర్ణయాలను పునఃసమీక్ష చేసింది.దీంతో ఇరు వర్గాల మధ్య పరస్పర అంగీకారంతో కూడిన ప్రకటన ఒకటి వెలువడింది.శనివారం రాత్రి పదకొండు గంటలు దాటాక ఇరు వర్గాలూ తమ అంగీకారం తెలుపుతూ కొన్ని కీలక నిర్ణయాలు వెలువరించాయి.దీంతో సమ్మె నిర్ణయాన్ని ఉపసంహరించుకుంటున్నామని ఉద్యోగ సంఘాలు ప్రకటించి, తమ డిమాండ్లకు అంగీకారంతెలిపినందుకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపాయి.
ఆంధ్రా ఉద్యోగులకు శుభవార్త.ఇప్పటిదాకా పీఆర్సీ అమలులో ఉన్న కొంత ప్రతిష్టంభన తొలగిస్తూ, కొన్నిడిమాండ్ల నెరవేర్పుకు సర్కారు సన్నద్ధం అవుతోంది. ఈ మేరకు నిన్నటి వేళ (శనివారం రాత్రి,06.02.2022) మంత్రుల కమిటీతో ఉద్యోగ సంఘాలు జరిపిన చర్చలు సఫలీకృతం అయ్యాయి.దీంతో ఉద్యోగులు,ఉపాధ్యాయులు సమ్మెను విరమిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు.
ఇదే విషయం నిన్నటి వేళ నాలుగు ప్రధాన ఉద్యోగ సంఘాలు ప్రకటించాయి. ముఖ్యంగా ఫిట్మెంట్ పెంపుపై ప్రభుత్వం సానుకూలంగాలేకపోయినా మిగిలిన డిమాండ్లకు మాత్రం ప్రభుత్వం అంగీకారం తెలిపింది.
అద్దెభత్యం శ్లాబుల్లో సవరణకు ఉద్యోగ సంఘాలు చెప్పిన విధంగా ప్రభుత్వం సవరించి, ఆమోదించింది. అదేవిధంగా కేంద్ర పీఆర్సీ మాదిరి కాకుండా ఇకపై ఐదేళ్లకు ఒకసారి రాష్ట్ర పీఆర్సీ వేసేందుకు కూడా సుముఖత వ్యక్తం చేసింది. వీటితో పాటు సచివాలయ ఉద్యోగులకు ఇస్తున్న 24శాతం హెచ్ఆర్ఏ కొనసాగింపునకు అంగీకారం ఇచ్చింది. రాష్ట్రం విడిపోయాక అప్పటి ఒప్పందం అనుసారమే సచివాలయ ఉద్యోగులకు 24 శాతం అద్దె భత్యం చెల్లింపుపై ఉన్న ఒప్పందాన్ని కొనసాగిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
దీంతో ఉద్యోగుల సమస్యలన్నీ పరిష్కారం అయ్యాయి. ముఖ్యమయిన సీపీఎస్ కు సంబంధించి టైం బౌండ్ తో కూడిన పరిష్కారం ఇవ్వాలని ప్రభుత్వం యోచిస్తోంది. మార్చిలోగా రోడ్డు మ్యాప్ ఖరారుకానుంది. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్దీకరణకు కమిటీ ఏర్పాటు చేయనున్నారు. ఎన్ఎంఆర్ ఉద్యోగుల విషయమై కూడా పరిశీలించనున్నారు. 2022 జూన్ 30లోపు గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ప్రొబెషన్ ఖరారు చేయనున్నారు. వీటితో పాటు ఉద్యోగులకు పాత విధానంలో చెల్లించే సీసీఏ ను కొనసాగించనున్నారు. ఇక పీఆర్సీకి సంబంధించి ఆర్టీసీ కి వేరుగా జీఓ విడుదల చేయనున్నారు.