తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీ పవర్లోకి వచ్చి 11 నెలలువుతోంది.. పలు సంస్కరణలతోపాటు.. ఉచిత బస్సు వంటి వాటిని అమలు చేస్తోంది.. కానీ వాటిని జనాలకు చెప్పుకోలేకపోతున్నామనే అసంతృప్తి, అసహనం ఆ పార్టీ నేతల్లో పెరిగిపోతోందట.. ప్రభుత్వానికి, పార్టీకి మధ్య సమన్వయ లోపం ఉందనే ప్రచారం జరుగుతోంది.. కొందరు సీనియర్లు ఎందుకు ప్రతిపక్షాలకు కౌంటర్లు ఇవ్వలేకపోతున్నారు..?
తెలంగాణలో పదేళ్ల తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు చేరువవుతోంది.. హైడ్రా కూల్చివేతలతో కొన్ని వర్గాలకు దగ్గరైన ప్రభుత్వం.. రుణమాఫి, ఉచిత బస్సు వంటి వాటి ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో పట్టు పెంచుకుంటోంది.. సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నా.. అవి సరిగ్గా ప్రజల్లోకి వెళ్లడం లేదనే భావన పార్టీ నేతల్లో వ్యక్తమవుతోంది.. ప్రభుత్వంపై బీఆర్ఎస్ నేతలు దుమ్మెత్తి పోస్తున్నా.. వారికి సరిగ్గా కౌంటర్లు ఇచ్చే నేతలెవ్వరూ కనిపిండం లేదు.. మంత్రులు కోమటిరెడ్డి, పొన్నం ప్రభాకర్ తప్ప మరెవ్వరూ సరిగా స్పందించడంలేదు..మిగిలిన మనకెందుకులే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారని పార్టీలోని సీనియర్ల అభిప్రాయం..
మంత్రుల విషయం పక్కన పెడితే.. అధికారం రాకముందే బీఆర్ఎస్ మీద తీవ్రమైన విమర్శలు చేసిన సీనియర్లు, అధికార ప్రతినిధులు ఎందుకు సైలెంట్ గా ఉన్నారనే ప్రశ్న అందరిలోనూ మెదులుతోంది.. సాక్ష్యాత్తూ రేవంత్ రెడ్డే రంగంలోకి దిగి బీఆర్ఎస్ కు కౌంటర్లు ఇస్తున్నారు తప్ప.. మిగిలిన వారు పట్టించుకోవడంలేదు.. అయితే ఇందుకు కారణం కూడా లేకపోలేదన్న ప్రచారం జరుగుతోంది.. సీనియర్లకు ప్రాధాన్యత ఇవ్వకపోవడం వంటి అంశాలను కొందరు తెరమీదకు తీసుకొస్తున్నారు. పక్క పార్టీ నుంచి వచ్చిన వారికి ఇస్తున్న ప్రాధాన్యత కూడా తమకు ఇవ్వడంలేదని.. కొందరు సీనియర్లు ఫీలవుతూ.. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారని పార్టీలో చర్చ జరుగుతోంది..
కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వానికి సమన్వయం లేదనే ప్రచారం కూడా జరుగుతోంది.. ప్రభుత్వం ఎన్ని మంచి కార్యక్రమాలు చేసినా.. నోరున్న నేతలెవ్వరూ.. ప్రభుత్వానికి అనుకూలంగా, ప్రతిపక్షాలకు కౌంటర్ గా మాట్లాడకపోవడంతో.. బీఆర్ఎస్ రెట్టింపు ఉత్సాహంతో విమర్శల దాడి పెంచిందని రాజకీయవర్గాలు అభిప్రాయపడుతున్నాయి.. దీన్ని సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ ఛీప్ మహేష్ గౌడ్ ఎలా పరిష్కరిస్తారో చూడాలి..