తెలంగాణ రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా.. ఈ ప్రశ్న తెరమీదకు వస్తూనే ఉంటుంది. సెటిలర్ల ఓటు ఎటు? అనే చర్చ సర్వ సాధారణం. ఇప్పుడు కూడా గ్రేటర్ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో హైదరాబాద్, దాని చుట్టుపక్కల సెటిలైన ఏపీ సహా ఇతర రాష్ట్రాల వారి ఓట్లు ఎటు? అనే చర్చ తెరమీదికి వచ్చింది. ప్రధానంగా గ్రేటర్ ఎన్నికలు ఇప్పుడు రెండు పక్షాలకు మధ్య జరుగు తున్న పోరుగానే ప్రొజెక్ట్ అవుతోంది. గతంలో అయితే. కాంగ్రెస్‌కు కూడా అంతో ఇంతో ప్రాధాన్యం ఉండేది. కానీ… ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు.
కాంగ్రెస్ తనను తానే బలహీన పరుచుకుంది. నాయకులు కకావికలం అయ్యారు. ఈ నేపథ్యంలో ప్రధాన పోరు.. కేసీఆర్.. వర్సెస్ బీజేపీల మధ్యే ఉండనుంది. ఈ నేపథ్యంలో సెటిలర్ల ఓట్లు ఎటు పడే అవకాశం ఉందనేది సందిగ్ధంగా ఉంది. ఏపీకి చెందిన సెటిలర్ల విషయంలో.. బీజేపీపై తీవ్ర ఆగ్రహం ఉంది. ఏపీకి విభజన చట్టంలో ఇచ్చన హామీలను నెరవేర్చలేదని సెటిలర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇది కనుక ఇచ్చి ఉంటే.. తాము రిటర్న్ టు పెవెలియన్ అన్నట్టుగా ఏపీకి వెళ్లి చిన్నా చితకా వ్యాపారాలైనా పెట్టుకుని డెవలప్ అవుతామనేది వారి భావన. అంతేకాదు, ఉద్యోగాలు కూడా వచ్చేవని.. కానీ, బీజేపీ ప్రభుత్వం ఏపీని పట్టించుకోవడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక, ఏపీ రాజధాని విషయంలోనూ.. బీజేపీ అనుసరిస్తున్న వైఖరిపై సెటిలర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎక్కువ మంది.. అమరావతిలో భూములు కొనుగోలు చేయడం.. హ్యాపీ నెస్ట్ అపార్ట్‌మెంట్లలో పెట్టుబడులు పెట్టడం.. వంటివి.. జరిగిపోవడంతో ఇప్పుడు వారంతా కూడా తీవ్ర ఆవేదన, ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇలాంటి వారు.. కేసీఆర్‌పై ఇష్టం లేకున్నా.. బీజపీకి మాత్రం వేయజాలరనేది విశ్లేషకుల అంచనా. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌కు ఒకింత ఎడ్జ్ ఉన్నప్పటికీ.. ఆ పార్టీ చేసుకుంటున్న స్వయంకృత విన్యాసం కారణంగా సెటిలర్లు అటు మొగ్గే ఛాన్స్ లేదు. ఎటొచ్చీ.. ఇప్పుడు కేసీఆర్ వైపే.. సెటిలర్లు మొగ్గు చూపుతారని అంటున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి