కరోనా బారిన పడితే ముఖ్యమంత్రి మమతా బెనర్జీని ఆలింగనం చేసుకుంటానంటూ పశ్చిమ బెంగాల్‌లోని బీజేపీ నేత అనుపమ్ హజ్రా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పశ్చిమ బెంగాల్ నుంచి బీజేపీ జాతీయ కార్యదర్శిగా ఎన్నికైన 24 గంటల్లోనే ఆయన మమతా బెనర్జీపై ఇటువంటి వ్యాఖ్యలు చేసి వివాదంలో చిక్కుకున్నారు. ఆదివారం బారైపూర్‌లో జరిగిన పార్టీ కార్యక్రమానికి అనుపమ్ హజ్రా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు అక్కడున్న ఏ ఒక్కరూ ఫేస్‌మాస్క్ ధరించలేదు. ఇదే విషయాన్ని ఓ రిపోర్టర్ ప్రశ్నించగా.. తాము కరోనా కంటే అతిపెద్ద శత్రువుతో పోరాడుతున్నామని ఆయన సమాధానమిచ్చారు.
‘మా కార్యకర్తలు కరోనా కంటే పెద్ద శత్రువైన మమతా బెనర్జీతో యుద్దం చేస్తున్నారు. వాళ్లు కరోనా బారిన పడలేదు కాబట్టి కరోనా అంటే భయపడరు. ఒకవేళ నాకు కరోనా సోకితే నేను ముఖ్యమంత్రి మమతా బెనర్జీని ఆలింగనం చేసుకుంటా. ఎందుకంటే కరోనా సోకిన వారిని ఆమె దయనీయంగా చూశారు. కరోనాతో మరణించిన వారి మృతదేహాలను కిరోసిన్‌తో కాల్చారు. చనిపోయిన కుక్కులు, పిల్లుల విషయంలో కూడా మనం ఈ విధంగా చేయం’ అని అనుపమ్ హజ్రా చెప్పుకొచ్చారు.