షార్జా వేదికగా జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ 9వ మ్యాచ్‌లో కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ పై రాజస్థాన్ రాయల్స్ 4 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. రాజస్థాన్ బ్యాట్స్ మెన్ అందరూ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. ఆరంభం నుంచి చివరి వరకు దూకుడుగా ఆడారు. సిక్సర్ల మోత మోగించారు. దీంతో రాజస్థాన్ జట్టు పంజాబ్‌పై ఘన విజయం సాధించింది.
మ్యాచ్‌లో ముందుగా రాజస్థాన్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోగా పంజాబ్ బ్యాటింగ్ చేపట్టింది. ఈ క్రమంలో పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్లను కోల్పోయి 223 పరుగులు చేసింది. ఆ జట్టు బ్యాట్స్‌మెన్లలో మయాంక్ అగర్వాల్ (106 పరుగులు, 10 ఫోర్లు, 7 సిక్సర్లు), కేఎల్ రాహుల్ (69 పరుగులు, 7 ఫోర్లు, 1 సిక్సర్) లు అద్భుతమైన ప్రదర్శన చేశారు. రాజస్థాన్ బౌలర్లలో రాజ్‌పూత్, టామ్ కుర్రాన్‌లకు చెరొక వికెట్ దక్కింది.
అనంతరం బ్యాటింగ్ చేపట్టిన రాజస్థాన్ 19.3 ఓవర్లలో 6 వికెట్లను కోల్పోయి 226 పరుగులు చేసింది. ఆ జట్టు బ్యాట్స్‌మెన్లలో సంజు శాంసన్ (85 పరుగులు, 4 ఫోర్లు, 7 సిక్సర్లు) అద్భుతంగా రాణించాడు. అలాగే స్టీవ్ స్మిత్ (50 పరుగులు, 7 ఫోర్లు, 2 సిక్సర్లు), తెవాతియా (53 పరుగులు, 7 సిక్సర్లు)లు కూడా ఆకట్టుకున్నారు. పంజాబ్ బౌలర్లలో షమీ 3 వికెట్లు తీయగా, కాట్రెల్, నీషమ్, అశ్విన్‌లు తలా 1 వికెట్ తీశారు.