ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అరాచక పాలన చేస్తుందంటూ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి విమర్శిస్తున్నారు.. తమ పార్టీకి చెందిన కార్యకర్తలని లక్ష్యంగా చేసుకొని దాడులు చేస్తున్నారని.. వినుకొండ కు చెందిన రషీద్ కుటుంబాన్ని పరామర్శించిన సందర్భంలో ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.. ఇదే సమయంలో ఏపీలో జరుగుతున్న అరాచకాలను యావత్ దేశం దృష్టికి తీసుకెళ్లేందుకు ఈనెల 24న ఢిల్లీలో ధర్నా చేస్తున్నామంటూ ప్రకటించారు.. అందుకు సంబంధించిన ఏర్పాట్లను సైతం రాజ్యసభ ఎంపీలు పర్యవేక్షిస్తున్నారు.. అయితే ఢిల్లీలో జగన్మోహన్ రెడ్డి చేపడుతున్న ధర్నాకి ఇతర ప్రాంతీయ పార్టీల మద్దతు ఉంటుందా..? కాంగ్రెస్కు ఆహ్వానం అందుతుందా..? ఈ ప్రశ్నలే ప్రస్తుతం ఏపీ రాజకీయాలలో చర్చనీయాంశంగా మారాయి..
ఆంధ్రప్రదేశ్లో బిజెపి జనసేన టిడిపి ప్రభుత్వం అధికారంలో ఉంది.. వారికి వ్యతిరేకంగానే జగన్మోహన్ రెడ్డి ఈనెల 24న ఢిల్లీలో ధర్నా చేయబోతున్నారు.. ఈ క్రమంలో ధర్నాకు ఇతర పార్టీలకు సంబంధించి ఎవరెవరిని ఆహ్వానించాలా అనే అంశంపై వైసీపీలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తుందట.. కలిసొచ్చే పార్టీలతో ఆందోళన చేస్తామని జగన్ ప్రకటించిన నేపథ్యంలో.. జగన్ పిలుపుకు ఏ పార్టీలు స్పందిస్తాయా అనే కోణంలో ఏపీలోని రాజకీయ విశ్లేషకులు ఆలోచనలో పడ్డారు.
కేంద్రంలో అధికారంలో ఉండే భారతీయ జనతా పార్టీ, దాని మిత్రపక్షాలను ధర్నాకు ఆహ్వానించే అవకాశం లేదు.. గతంలో బిజెపితో జగన్ కి సత్సంబంధాలు ఉన్నప్పటికీ.. ప్రస్తుతం కూటమి పార్టీలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తుంది.. మరోపక్క కాంగ్రెస్ పార్టీని సైతం ఆహ్వానించే పరిస్థితుల్లో జగన్ లేరనే ప్రచారం జరుగుతుంది.. అవసరమైన ప్రతిసారి కాంగ్రెస్ పార్టీపై జగన్ విమర్శలు చేస్తూ ఉండడమే అందుకు కారణం అని వైసీపీ నేతలు చెబుతున్నారు.. అధికారంలో ఉన్న సమయంలో బిజెపితో జగన్ రహస్య ఒప్పందం చేసుకున్నారనే విమర్శలు ఉండడంతో టీఎంసీ, డిఎంకె, శరత్ పవార్ పార్టీలు సైతం జగన్ కి దూరమయ్యాయని రాజకీయ సర్కిల్లో చర్చ నడుస్తోంది..
24న ఢిల్లీలో జరిగే ధర్నాకు ఏ పార్టీ నేతలు పిలవాలి అనే సందేహంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఉన్నారట.. ఒంటరిగా ధర్నా చేస్తే.. కేంద్రం దృష్టిని ఆకర్షించలేమని.. వైసీపీ భావిస్తోంది.. జగన్మోహన్ రెడ్డి ఢిల్లీకి వెళ్లిన నేపథ్యంలో.. ఏ పార్టీకి చెందిన నేతలను కలిసి మద్దతు కోరుతారో చూడాలి మరి..