జగన్ బంపర్ ఆఫర్.. ఎన్నికల్లో గెలిస్తే పింఛను 3000
ఏపీలో రాజకీయ వేడి రోజు రోజుకూ పెరిగిపోతున్నది. టీడీపీ పార్టీ పింఛన్లను 2 వేలు చేస్తే.. వైఎస్ జగన్ 3 వేలు చేస్తామని హామీ ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ పార్టీ గెలిస్తే వృద్ధులకు ఖచ్చితంగా మూడు వేల రూపాయల పింఛనును అందిస్తామని జగన్ హామీ ఇచ్చారు. తిరుపతిలో జరిగిన సమరశంఖారావం సభలో జగన్ ఈ హామీ ఇచ్చారు.
“వచ్చే ఎన్నికల్లో మేం ఎవరితో పొత్తు పెట్టుకోం. గత ఎన్నికల్లో కూడా ఎవరితో పొత్తు పెట్టుకోలేదు. ఈ రెండు నెలలూ అంతా అప్రమత్తంగా ఉండాలి. ప్రతి ఓటరు ఓటు వేసేలా బూత్ కమిటీలే బాధ్యత తీసుకోవాలి. చంద్రబాబు చాలా ప్రలోభాలకు గురి చేసే అవకాశం ఉంది. ఇప్పుడు వచ్చే ఎన్నికలు న్యాయానికి, అన్యాయానికి మధ్య జరిగేవి. డబ్బుకు, ఆప్యాయతకు మధ్య జరిగేవి. మీరంతా బాధ్యతగా ఉంటేనే వచ్చే ఎన్నికల్లో వైఎస్సాఆర్‌సీపీ పార్టీ అధికారంలోకి వస్తుంది. మనమంతా ప్రజల ప్రభుత్వం కోసం సవ్యసాచుల్లా పని చేయాలి..” అని వైఎస్ జగన్ హితబోధ చేశారు.
ఈ మనిషిని అన్న అనాలా? దున్న అనాలా?
ఈసందర్భంగా వైసీపీ సమర శంఖారావం సభలో జగన్ చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. చంద్రబాబు ప్రజలకు సినిమా చూపిస్తున్నారు. ఆయన పాలనలో ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారో దేశమంతా చూస్తోంది. పాదయాత్రలో భాగంగా నేను ప్రజలు పడే అవస్థలను దగ్గర్నుంచి చూశా. అందుకే.. రాజకీయంగా, ఆర్థికంగా మిమ్మల్ని పైకి తీసుకొస్తా. నల్ల చొక్కా వేసుకొని చంద్రబాబు డ్రామాలు ఆడుతున్నాడు. పసుపు-కుంకుమ పేరుతో ఈ కొత్త డ్రామాలు ఏంది. అది కూడా ఎన్నికలు వచ్చే సమయంలో. ఇన్నేళ్లు ఏం చేశాడు చంద్రబాబు.. నాలుగున్నరేళ్లలో మహిళలు గుర్తుకురాలేదా? ఎన్నికల సమయంలో పోలీసులతో గూండాగిరి చేయిస్తాడు చంద్రబాబు.
ప్రత్యేక హోదాను చంద్రబాబు తాకట్టు పెట్టాడు. అంతే కాదు.. వైఎస్సాఆర్‌సీపీ సానుభూతిపరుల ఓట్లను తొలగించారు. ఇంకా తొలగిస్తున్నారు. ఇన్నేళ్లు బీజేపీతో రాసుకుపూసుకుతిరిగి ఇప్పుడు బీజేపీతో పోరాటం అంటూ కొత్త పాట పాడుతున్నాడు బాబు. అది ఏపీ బడ్జెట్ కాదు.. చంద్రబాబు బడ్జెట్. ఎన్నికల సమయంలో ఇన్ని డ్రామాలు ఆడుతున్న మనిషిని ఏమనాలి.. అన్న అనాలా? దున్న అనాలా? అంటూ జగన్ ధ్వజమెత్తారు.