రాజకీయాల్లో విమర్శలు, ప్రతివిమర్శలు కామన్. అయితే, తాజాగా వైసీపీ ఎంపీ, నరసాపురం నుంచి విజ యం సాధించిన రఘురామకృష్ణంరాజు ఏకంగా తన సటైర్లతో జనసేనానిని ఓ ఆట ఆడించారు. రాజధానిలో తాజాగా పవన్ పర్యటించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన సీఎం జగన్‌కు కొన్ని అల్టిమేటాలు జారీ చేశారు. రాజధానిని తరలిస్తే.. ఒప్పుకొనేది లేదన్నారు. తనకు సమాధానం చెప్పాలన్నారు. లేకపోతే.. తాను ఢిల్లీ వెళ్లి.. కేంద్రానికి కంప్లయింట్ చేస్తానని చెప్పారు. సరే! రాజకీయాల్లో ఇవన్నీ సహజమే.. అయితే, ఈ విషయంపై ఓ టీవీ చానెల్ చర్చ పెట్టింది.
ఈ సందర్బంగా.. వైసీపీ, జనసేన, టీడీపీ నేతలను చర్చలకు ఆహ్వానించారు. ఈ సందర్భంగా జనసేన నాయకులు దుర్గేష్.. పవన్ వచ్చారు కాబట్టి.. రాజధానిలో పర్యటించారు కాబట్టి.. వైసీపీ నాయకులు ఒణికి పోతున్నారని, భయంలో అల్లాడిపోతున్నారని ఎద్దేవా చేశారు. అయితే, ఇదే చర్చకు వచ్చిన ఎంపీ రఘురామకృష్ణంరాజు.. పవన్‌ను కూరలో కరేపాకులా తీసేశారు. అసలు పవన్ అంటే ఎవరికి లెక్క! అంటూ.. ఆయన వేసిన సటర్లు కడుపుబ్బ నవ్వించాయి. పవన్ అంటే ఎవరికి భయం.. ఆయనేమన్నా రాక్షసుడా? చక్కటి అందగాడు.. ఆయనను చూసి ఎవరండీ భయపడేది! అంటూ చలోక్తులు విసిరారు.
ఇక, పవన్ స్టైల్‌ను అనుకరిస్తూ.. “ఇప్పుడు పవన్‌కు సినిమా షూటింగులు లేవు కాబట్టి రాజధానిలో తిరు గుతున్నారు. ఆయన నాకు చెప్పాల్సిందే.. హ!!.. అంటే చెప్పేయాలా? అని సటైరికల్‌గా ఆటపట్టించారు. అదే సమయంలో గతంలో చంద్రబాబు ప్రభుత్వంలోనూ రైతులు తమ భూములు లాక్కుంటున్నారని పవన్ దగ్గర గోడు వినిపించిన సమయంలోనూ ఆయన చేసింది ఏమీ లేదని, ఆయన వల్ల ఆగిపోయింది కూడా ఏమీలేదని కేవలం ఇదంతా ప్రచారమేనని కొట్టిపారేశారు. ఇక, రాజధాని విషయంలోనూ ఇది తరలించేది కాదని తెలిసి కూడా పవన్ పర్యటించారంటే.. తాను వచ్చాను కాబట్టి.. రాజధాని మార్చలేదనే ప్రచారం చేసుకునేందుకు వచ్చారే తప్ప.. తాను చేసింది ఏమీలేదేన్నారు.
అదేసమయంలో మరో కీలక వ్యాఖ్య కూడా చేశారు. పొగుడుతున్నట్టుగానే ఉంటూ.. కుమ్మేశారు. ఎన్నికల్లో ఒక్కసీటు సాధించిన ఆయన వద్దకే రైతులు ఎందుకు వెళ్తున్నారు? అక్కడే నివాసం ఏర్పాటు చేసుకుని, పవన్ కన్నా 23 రెట్లు సీట్లు సాధించిన చంద్రబాబు ఎవరూ పట్టించుకోరు ఎందుకని? అని అంటూ నర్మగర్భంగా అటు పవన్, ఇటు బాబును కూడా ఏకేశారు. పవన్ ఢిల్లీ వెళ్లినా.. అమెరికా వెళ్లినా.. ఏమీ సాధించేది లేదని పరోక్షంగా విమర్శలు సంధించారు. మొత్తానికి వైసీపీ ఎంపీల్లో ఇప్పటికి ఒక్కరు సమయ స్పూర్తిగా స్పందిస్తూ.. సోషల్ మీడియాలో గుర్తింపు పొందడం విశేషం. ఇప్పుడు ఈ వీడియో భారీగా వైరల్ అవుతోంది.