ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ పొంగులేటికి కండువా కప్పి సాధరంగా ఆహ్వానించారు. పొంగులేటితో పాటు పిడమర్తి రవి, అరికెల నర్సిరెడ్డి, పాయం వెంకటేశ్వర్లు, కోరం కనకయ్య, డీవీ రావు, పాపిరెడ్డితో పాటు పలువురు హస్తం తీర్థం పుచ్చుకున్నారు. అనంతరం 109 రోజులు పీపుల్స్ మార్చ్ పాదయాత్ర చేసిన సీఎల్పీ నేత భట్టి విక్రమార్కను రాహుల్ గాంధీ అభినందించారు. ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమానికి తెలంగాణ కాంగ్రెస్ సీనియర్లు హాజరయ్యారు.
అంతకుముందు ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో విజయవాడలోని గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న రాహుల్ గాంధీకి ఏపీ కాంగ్రెస్ నేతలు ఘనస్వాగతం పలికారు. అనంతరం ఆయన హెలికాఫ్టర్‌లో బయల్దేరి ఖమ్మం సభావేదిక వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తదిరత నేతలు రాహుల్‌కు స్వాగతం పలికారు. అనంతరం సభా వేదికపైకి చేరుకుని ప్రజలకు అభివాదం చేశారు. ఈ క్రమంలో ప్రజాగాయకుడు, ప్రజా యుద్ధ నౌక గద్దర్ రాహుల్‌ను ముద్దాడారు. ఆపై తన సుదీర్ఘ పీపుల్స్ మార్చ్ పాదయాత్రను పూర్తి చేసుకుని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క వేదికపైకి చేరుకుని రాహుల్‌తో కరచాలనం చేశారు.