రాష్ట్రంలో నీటిపారుదలపై ప్రధాన దృష్టి పెట్టారు ముఖ్యమంత్రి కేసీఆర్. కోటి ఎకరాల మాగాణిగా తెలంగాణను తీర్చిదిద్దేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఇందులో భాగంగానే నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణంపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఖమ్మం జిల్లాలో ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా సీతారామ ఎత్తిపోతల ప్రాజెక్టు చేపడుతున్నారు.
ఈ ప్రాజెక్టులో కీలకమైన రూ.301.45 కోట్ల విలువైన 13 ప్యాకేజీ పనులు బీఆర్ఎస్ అసంతృప్త నేత, ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డికి చెందిన రాఘవ కన్‌స్ట్రక్షన్ కంపెనీకి దక్కింది. ఫిబ్రవరి 8న టెక్నికల్ బిడ్ తెరిచిన నీటిపారుదలశాఖ అధికారులు గురువారం ప్రైస్ బిడ్ తెరిచారు. ఈ ప్యాకేజీ పనుల కోసం మూడు కంపెనీలు సీల్డ్ టెండర్లు దాఖలు చేయగా పొంగులేటికి చెందిన రాఘవ కన్‌స్ట్రక్షన్ కంపెనీ అంచనా విలువపై 0.99 శాతం తక్కువ విలువ కోట్ చేసింది.
పోటీ పడిన బీవీఎస్‌ఆర్ కంపెనీ అంచనా విలువపై 4.95 శాతం, హెచ్‌ఈఎస్ కంపెనీ 4.50 శాతం అధిక ధరలను కోట్ చేశాయి. ప్రైస్ బిడ్ గురువారం ఖమ్మంలోని ఎస్‌ఈ కార్యాలయంలో తెరిచి.. హైదరాబాద్‌లోని ఉన్నతాధికారులకు నివేదిక పంపించారు. దీన్ని రాష్ట్రస్థాయిలోని టెండర్ కమిషన్ పరిశీలించిన తర్వాత ఉన్నత స్థాయి కమిటీ ఖరారు చేయాల్సి ఉంటుంది.