గత కొద్దిరోజులుగా ఖమ్మంలో రాజకీయ అస్థిరత నెలకొంది. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి పార్టీ మారుతున్నారంటూ ఊహాగానాలు వస్తున్నాయి. ఈ క్రమంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డిపల్లి మండల కేంద్రంలో ఆయన బీఆర్ఎస్ కార్యకర్తలతో సమావేశమయ్యారు. అనంతరం విలేకరులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు.
ఒక వేళ బీఆర్ఎస్‌ను వీడాల్సి వస్తే దిల్లీలోనో, అమెరికాలోనో దొంగచాటుగా కండువా కప్పుకోవాల్సిన అవసరం తనకు లేదని పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఖమ్మం నడిబొడ్డున 2.50 లక్షల మంది అభిమానుల సమక్షంలో కండువా కప్పుకొంటానని స్పష్టం చేశారు. ‘ఆలూ లేదు చూలూ లేదు.. కొడుకు పేరు సోమలింగం’ అన్నట్లు తాను బీఆర్ఎస్‌ను వీడుతున్నానని మీడియానే ప్రచారం చేస్తోందని అన్నారు.
అంతకుముందు పార్టీ మండల ప్రధాన కార్యదర్శి పర్సా వెంకటేశ్వరరావు ఇంటి వద్ద కార్యకర్తలతో ఆయన కాసేపు ముచ్చటించారు. అందరికీ అండగా ఉంటానని ఈ సందర్భంగా వారికి భరోసా ఇచ్చారు.